ఎండలతో జాగ్రత్త

21 Mar, 2023 01:34 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

తిరుపతి అర్బన్‌: ‘జిల్లాలో ఈ ఏడాది ఎండల తీవ్రత అధికం. 48–49 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వడగాడ్పులు కూడా బలంగా ఉంటాయి. వీటి నుంచి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి’అని కలెక్టర్‌ కే.వెంకటరమణారెడ్డి సూచించారు. సోమవారం ఎండల తీవ్రతకు సంబంధించి జేసీ డీకే బాలాజీతో కలసి అధికారులు, వివిద సేవా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎండల తీవ్రత, వడగాడ్పులు నమోదు కానున్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం, జిల్లా, మండల స్థాయిలో కంట్రోల్‌ రూముల ఏర్పాటు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు మజ్జిగ పంపిణీ, చలి వేంద్రాల ఏర్పాటు లాంటివి చేయాలన్నారు. రోజూ నమోదు కానున్న ఎండ తీవ్రత వివరాలు మీడియాకు అందించి ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటుతో ప్రచురించేలా చూడాలని కోరారు. స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాల సభ్యుల సహకారం తీసుకోవాలన్నారు. గ్రామాలలో పశువుల కోసం ఏర్పాటు చేసిన వాటర్‌ టబ్స్‌లో ఎప్పటికప్పుడు నీరు నింపేలా, విద్యుత్‌ అంతరాయం కలిగితే చేతి పంపులు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. పాఠశాలల పిల్లలకు సంబంధించి ప్రభుత్వం త్వరలో స్కూల్‌ సమయం నిర్ణయించనుందని ఆ సమయం ప్రకారం వెంటనే పిల్లలు ఇంటికి చేరేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. మధాహ్నం 12–4 గంటల సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఈ సమీక్షలో డీఆర్వో శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి విజయకుమార్‌, డీఈఓ శేఖర్‌, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ పరమేశ్వరస్వామి, వైద్యశాఖ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు బాలకృష్ణా రెడ్డి, రాజా రెడ్డి, మార్కండేయ రెడ్డి, సుబ్రహ్మణ్యం, అరుణ, అమరేంద్ర, గౌరీ, సుమలత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు