● నీటి పొదుపు.. ఎక్కువ దిగుబడి ● ఉద్యానపంటలకు అధిక వినియోగం ● రైతులకు భారీగా సబ్సిడీ సాయం ● నచ్చిన కంపెనీని ఎంచుకునేలా రైతులకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ● డిమాండ్‌కు తగినట్లు డ్రిప్‌ పరికరాలు, స్ప్రింక్లర్లు అందజేత

27 Mar, 2023 01:32 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం ఎక్కువగా ఉంది. సుమారు లక్ష హెక్టార్లకు పైగా ఉద్యాన పంటలు సాగు చేసి రైతులు ఆదాయం పొందుతున్నారు. ప్రధానంగా మామిడి, టమాట, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, బీన్స్‌, వంగ, బెండతోపాటు ద్రాక్ష పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. అత్యధికంగా మామిడి సుమారు 60 వేల హెక్టార్లలో సాగులో ఉంది.

నచ్చిన కంపెనీ ఎంపిక

ప్రభుత్వం ఎక్కువ కంపెనీలకు అవకాశం ఇచ్చి డ్రిప్‌ పరికరాలను అందజేసేలా పర్యవేక్షిస్తోంది. నాణ్యతను పెంచుకోవడం కోసం ప్యాక్‌ హౌసులు, కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేసుకునేందుకు రాయితీ ఇస్తోంది. స్ప్రేయర్లు, ఆధునిక యంత్ర సామగ్రిని సరఫరా చేస్తోంది. టమాటా సాగుకు సంబంధించి చిన్న తరహా ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, రవాణా వాహనాలు అందజేస్తోంది. సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, ఆంధ్రప్రదేశ్‌ సమీకృత నీటిపారుదల, వ్యవసాయ పరివర్తన పథకం, నీటిపారుదల జీవనోపాధుల అభివృద్ధి ద్వారా జిల్లాలో ఉద్యాన పంటలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి రాయితీపై పరికరాలను ఇస్తున్నారు.

5వేల హెక్టార్లకు డ్రిప్‌ పరికరాలు

వంద శాతం మైక్రో ఇరిగేషన్‌ లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. 2022– 23 సంవత్సరంలో జిల్లాలో ఐదువేల హెక్టార్లలో డ్రిప్‌, ఇతర పరికరాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఐదు ఎకరాల్లోపు ఉన్న సన్న, చిన్న కారు రైతులకు 90 శాతంతో 2.18 లక్షల రాయితీతో పరికరాలు అందిస్తున్నారు. ఐదు నుంచి పది ఎకరాల వరకు కలిగిన రైతులకు 70 శాతంతో రూ.3.46 లక్షల రాయితీతో పరికరాలను అందిస్తున్నారు. సన్న చిన్న కారు రైతులకు 55 శాతంతో స్ప్రింక్లర్‌ పరిక రాలు, ఐదు నుంచి పది ఎకరాల రెతులకు 45 శాతంతో పరికరాలను అందిస్తున్నారు. ఇప్పటికే 15 వేల హెక్టార్లకు పైగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తు ఇలా

జిల్లాలో 16 కంపెనీలకు చెందిన డ్రిప్‌, అనుబంధ పరికరాలు అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో రైతులు చేసుకున్న దరఖాస్తులను కలెక్టర్‌ అనుమతి పొందిన తర్వాత డ్రిప్‌ ఏర్పాటు చేసే (ఇన్సులేషన్‌) కంపెనీకి పంపుతారు. అనంతరం కంపెనీ ప్రతినిధితో పాటు హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ పరిశీలించి సర్వే చేస్తారు. అంచనాలకు సంబంధించి సబ్సిడీ రుణం పోను మిగతా సొమ్ము ఆన్‌లైన్‌ ద్వారా నగదు చెల్లిస్తారు. తర్వాత 15 రోజుల్లోపు పరికరాలు అమర్చుతారు. 2022–2023లో 6,512 మంది రైతులకు రూ. 61.80 కోట్ల విలువైన డ్రిప్‌ పరికరాలు అందించారు. 5,719 హెక్టార్లలో పంటలు సాగులోకి తీసుకొచ్చారు. రైతులు రూ.51.37 కోట్ల సబ్సిడీ పొందారు.

జిల్లాలో డ్రిప్‌సాగు(బిందుసేద్యం) విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. నీటి పొదుపు, అధిక దిగుబడి, ఆదాయం పొందేందుకు ఈ బిందు సేద్యంపై రైతులు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో అత్యధికంగా సాగవుతున్న ఉద్యానవన పంటల్లో డ్రిప్‌, స్ప్రింక్లర్లు, మల్చింగ్‌ షీట్‌ వంటి ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ రైతులు లాభాల బాట పడుతున్నారు. ప్రభుత్వం రాయితీలతోపాటు కంపెనీని ఎంచుకునే అవకాశం కల్పించడం రైతులకు వరంగా మారింది. 2022–23కు జిల్లాలో ఐదువేల హెక్టార్లలో డ్రిప్‌, ఇతర పరికరాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు