విజయవంతంగా ఎల్‌వీఎం3–03 ప్రయోగం

27 Mar, 2023 01:32 IST|Sakshi

అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం ఖ్యాతి ఇనుమడించింది.. ప్రపంచదేశాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది.. వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగంలో మరోసారి విజయకేతనం ఎగురవేసింది.. ఇస్రో బాహుబలిగా పేరుగాంచిన జీఎస్‌ఎల్‌వీ (ఎల్‌వీఎం–3– ఎం3) రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.. నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి సురక్షితంగా శాటిలైట్లను ప్రవేశపెట్టింది.. ప్రతిష్టాత్మక ప్రయోగం జయప్రదం కావడంతో షార్‌ శాస్త్రవేత్తల సంబరం అంబరాన్నంటింది. వీక్షించిన సందర్శకుల్లో హర్షాతిరేకం వ్యక్తమైంది.

సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోదనా సంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఆదివారం ఉదయం 9.00.20 గంటలకు ఎల్‌వీఎం3–ఎం3 ఉపగ్రహ వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ వన్‌వెబ్‌ ఇండియా–2 పేరుతో 36 ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. కేవలం 97 నిమిషాల్లోనే భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులోని లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో సురక్షితంగా ప్రవేశపెట్టింది. ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరు గాంచిన ఎల్‌వీఎం3–ఎం3 లాంటి భారీ రాకెట్‌ను కూడా వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగించడం ఇది రెండోసారి కావడం విశేషం. దీంతో ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ కూడా గ్లోబల్‌ కమర్షియన్‌ లాంచ్‌ సర్వీస్‌ మార్కెట్లోకి ప్రవేశించింది.

శాస్త్రవేత్తల సంబరం
ఆదివారం ఉదయం కౌంట్‌డౌన్‌ పూర్తి కావడంతో మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పెద్ద శబ్దంతో ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ 5,805 కిలోలు బరువు కలిగిన వన్‌వెబ్‌ ఇండియా–2 పేరుతో 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను మోసుకుని నింగికేగింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసి మూడో దశలో అమర్చిన సీ–25 అంటే 25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనం సాయంతో దూసుకెళ్లింది. రాకెట్‌ శిఖరభాగంలో అమర్చిన 36 ఉపగ్రహాలను నాలుగేసి ఉపగ్రహాల చొప్పున 9 సార్లుగా 97 (1.37 గంటల వ్యవధిలో) నిమిషాలకు దిగ్విజయంగా నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ వరుసగా ఆరోసారి విజయం సాధించడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

చప్పట్లు కొడుతూ.. ఈలలు వేస్తూ..
రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు మన రాష్ట్రంతోపాటు, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుంచి సుమారు పది వేలమందికి పైగా విచ్చేశారు. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట వరకు కార్లు, స్కూల్‌ వ్యాన్లు, బస్సులు పెద్దసంఖ్యలో బారులు తీరాయి. సందర్శకులు రాకెట్‌ ఫ్రయోగాన్ని వీక్షించేందుకు అనువుగా శ్రీహరికోటలో షార్‌ అధికారులు ఒక ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. అలాగే పులికాట్‌ సరస్సు వద్ద రోడ్డుపై సైతం భారీగా జనం చేరుకున్నారు. రాకెట్‌ నింగిలోకి దూసుకెళుతుంటే ప్రజలు ఉత్సాహంగా చప్పట్లు, ఈలలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు
ఎల్‌వీఎం3–ఎం3 ప్రయోగాన్ని విజయవంతం కావడంపై ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. వాణిజ్యపరమైన ప్రయోగాలు చేయడంలో మరోసారి సత్తాచాటారని కొనియాడారు. అలాగే శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సైతం రాకెట్‌ ప్రయోగంపై స్పందించారు. దేశ ప్రతిష్టను పెంచిన ఇస్రో చైర్మన్‌ కె.సోమనాథ్‌, షార్‌ డైరెక్టర్‌ ఎ.రాజరాజన్‌, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వాణిజ్యపరంగా ఇది ఘనవిజయమని ప్రశంసించారు.

దశలవారీగా ప్రయోగ క్రమం ఇలా..

ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ 43.5 పొడవు కలిగి 643 టన్నులు బరువుతో నింగివైపుకు దూసుకెళ్లింది. 6 ఉపగ్రహాలను రోదసీలోకి మోసుకుని వెళ్లింది.

మొదటి దశలో రాకెట్‌కు ఇరువైపులా అత్యంత శక్తివంతమైన ఎస్‌–200 బూస్టర్లు సాయంతో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి బయలుదేరింది.

రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 136.5 సెకన్లకు మొదటి దశను పూర్తి చేశారు.

185.5 సెకన్లకు రాకెట్‌ శిఖరభాగాన ఉపగ్రహాలకు అమర్చిన దశలో హీట్‌షీల్డ్స్‌ విజయవంతంగా విడిపోయాయి.

ఎల్‌–110 అంటే 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని ఉపయోగించి 306.7 సెకన్లకు రెండోదశను పూర్తి చేశారు.

సీ–25 అంటే 25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనాన్ని వినియోగించి 933.1 సెకన్లకు మూడోదశను పూర్తి చేశారు.

వన్‌వెబ్‌ ఇండియా– 2 పేరుతో అమర్చిన 36 ఉపగ్రహాలను క్రయోజనిక్‌ దశతో 1174.6 సెకన్లకు భూమికి దగ్గరగా 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఎర్త్‌ ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల వంపుతో వృత్తాకార కక్ష్యలో మొదటిగా నాలుగు ఉపగ్రహాలను (1కే, 3కే, 5కే, 7కే) ప్రవేశపెట్టారు.

204.6సెకన్లకు మరో నాలుగు ఉపగ్రహాలు (2ఏ, 4ఏ, 6ఏ, 8ఏ) ప్రవేశపెట్టారు.

004.6 సెకన్ల్లకు ఇంకో నాలుగు ఉపగ్రహాలు (1ఏ, 3ఏ, 5ఏ, 7ఏ) ప్రవేశపెట్టారు.

2034.6 సెకన్లకు మరో నాలుగు ఉపగ్రహాలు (2బీ, 4బీ, 6బీ, 8బీ)ను ప్రవేశపెట్టారు.

గంట పాటు గ్యాప్‌ తీసుకుని ముప్‌పై ఏడు నిమిషాల్లో మిగిలిన 20 ఉపగ్రహాలను నాలుగేసి చొప్పున విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

1.37 (గంట ముప్పై ఏడు నిమిషాలకు) గంటలకు ప్రయోగాన్ని విజయవంతగా పూర్తి చేశారు.

ప్రయోగానంతరం యూకేకు చెందిన అంటార్కిటికా గ్రౌండ్‌స్టేషన్‌ వారు ఉపగ్రహాలను అఽధీనంలోకి తీసుకున్నారు. అన్నీ సక్రమంగా పనిచేస్తుట్టుగా సిగ్నల్స్‌ అందాయని ప్రకటించారు.

మరిన్ని వార్తలు