పకడ్బందీగా పది పరీక్షలు

27 Mar, 2023 01:32 IST|Sakshi

ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం

152 కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

హాజరుకానున్న 28,413 మంది విద్యార్థులు

చిత్తూరు కలెక్టరేట్‌/తిరుపతి ఎడ్యుకేషన్‌ : పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు కొనసాగనున్న పరీక్షల కోసం మొత్తం 152 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. ల్లా వ్యాప్తంగా మొత్తం 26,673 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే 1,740 మంది ప్రైవేట్‌ విద్యార్థులు సైతం పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఈ మేరకు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఇప్పటికే పరీక్షల నిర్వహణపై చీఫ్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులకు కీలక సూచనలు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు.

మల్టీఫుల్‌ జంబ్లింగ్‌ విధానంలో..

పారదర్శకంగా పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మల్టీఫుల్‌ జంబ్లింగ్‌ విధానంలో విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అలాగే ఆన్‌లైన్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో హాల్‌టికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. చీఫ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారుల, ఇన్విజిలేటర్లతో సహా విద్యార్థులు ఎవరూ సెల్‌ఫోన్‌లను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేకంగా కసరత్తు చేశామన్నారు. అందులో భాగంగా సబ్జెక్ట్‌ నిపుణులతో రూపొందించిన విజయసాధన పుస్తకాలను విద్యార్థులకు అందించామని తెలిపారు. అలాగే సాయంత్ర వేళల్లో ప్రత్యేక తరగతుల నిర్వహించి పిల్లలను సన్నద్ధం చేసినట్లు వెల్లడించారు.

ఉత్తమ ఫలితాలకు విద్యావేత్తల సూచనలు

● విద్యార్థులు చక్కటి ప్రణాళికతో చదువుకోవాలి. తల్లిదండ్రులు సైతం పిల్లలను టెన్షన్‌ పెట్టకూడదు. స్వేచ్ఛగా చదువుకునేలా ప్రోత్సహించాలి.

● ముందుగా భయాన్ని విడనాడాలి. ఒత్తిడిని జయించాలి. ఇందుకోసం రోజూ పది నిముషాలపాటు ధ్యానం చేయడం మంచిది.

● అలాగే రాత్రింబవళ్లు చదవడం కూడా శ్రేయస్కరం కాదు. తగినంత విశ్రాంతి లేకుంటే నేర్చుకుంది మర్చిపోయే ప్రమాదముంది. రాత్రి పదిగంటలకల్లా నిద్రపోవాలి. వేకువజామునే లేచి చదువుకోవాలి.

● పరీక్షలు దగ్గర పడినందున ఇకపై కొత్తవి చదువుకోవడం కాకుండా, ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠ్యాంశాలను రివిజన్‌ చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలి.

● సెల్‌ఫోన్‌ వినియోగాన్ని పక్కనపెట్టాలి. స్నేహితులతో కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృథా చేసుకోవడం మంచిది కాదు.

● ఉత్తమ మార్కులు సాధించేందుకు అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యమివ్వాలి. ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి.

● ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. బయట ఆహారం తీసుకోకపోవడం మంచిది. పరీక్ష సమయంలో జ్వరం తదితర రోగాల బారిన పడకుండా చూసుకోవాలి.

● తల్లిదండ్రులు సైతం పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. కాఫీలు, టీలు తగ్గించాలి. మజ్జిక, పళ్లరసాలు సేవించాలి. ఆయిల్‌ ఫుడ్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.

● పరీక్షకు వెళ్లేప్పుడు పెన్నులు, పెన్సిళ్లు మర్చిపోకుండా తీసుకెళ్లాలి. జవాబు పత్రాల్లో కొట్టివేతలు లేకుండా రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్షర దోషాలు లేకుండా చక్కగా రాసేందుకు యత్నించాలి. క్రమ పద్ధతిలో సమాధానాలు రాయాలి. ఏ ప్రశ్నకి ఏ జవాబు రాశామో పేపర్‌ దిద్దే అధ్యాపకులకు అర్థమయ్యేలా నీట్‌గా పొందుపరచాలి.

ఒత్తిడిని జయించాలి

పదో తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయించాలి. చక్కగా చదువుకుని పరీక్షలకు సన్నద్ధం కావాలి. పాఠశాలలో రాసినట్టుగానే పబ్లిక్‌ పరీక్షలు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. అలాగే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం. ఆయా కేంద్రాల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాం.

– వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌, తిరుపతి

పక్కాగా ఏర్పాట్లు

పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేశాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారుల సహకారంతో వసతులు కల్పించాం. పరీక్షల నిర్వహణకు అవసరమైన సీఎస్‌, డీఓ, ఇతర అధికారులు, స్క్వాడ్‌ బృందాలను నియమించాం. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.

– శేఖర్‌, డీఈఓ, తిరుపతి

మరిన్ని వార్తలు