గడువులోగా రీ సర్వే పూర్తిచేయండి

28 Mar, 2023 01:44 IST|Sakshi
రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తదితరులు

వెంకటగిరి: నిర్ధేశించుకున్న గడువులోగా జగనన్న భూహక్కు – భూరక్ష పథకం ద్వారా కచ్చితత్వ హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కె వెంకటరమణారెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మండలంలోని డీసీ కండ్రిగ గ్రామంలో జాయింట్‌ కలెక్టర్‌ డీకే బాలాజీ, గూడూరు ఆర్డీఓ కిరణ్‌కుమార్‌, జిల్లా సర్వేయర్‌ జయరాజ్‌తో కలిసి ఆయన రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రీసర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. రీ సర్వే నిర్వహించే గ్రామాల్లో సర్వేకు ముందుగా నోటీసులు అందజేయడం, దండోరా వేయించడం వంటి నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు. కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నప్పుడు భూయజమానులకు నోటీసులు అందించి గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌ చేపట్టాలన్నారు. అనంతరం మొక్కలపాడు గ్రామంలో రీ సర్వేను పరిశీలించారు. తహసీల్దార్‌ పద్మావతి, రీ సర్వే డెప్యూటీ తహసీల్దార్‌ చంగల్‌రాణి పాల్గొన్నారు.

రెండవ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

తిరుమల : రెండవ ఘాట్‌ రోడ్డులో ఓ కారు ప్రమాదానికి గురైంది. తమిళనాడుకు చెందిన భక్తులు కారులో శ్రీవారి దర్శనార్థం అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరారు. ఈ క్రమంలో రెండవ ఘాట్‌ రోడ్డు మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. ఇంతలో అటుగా వెళ్తున్న వన్‌టౌన్‌ సీఐ జగన్‌మోహన్‌రెడ్డి 108కు సమాచారం అందించి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో తిరుపతి రుయాకు తరలించారు.

>
మరిన్ని వార్తలు