గంజాయి కేసులో ఏడుగురికి రిమాండ్‌

28 Mar, 2023 01:44 IST|Sakshi

తిరుపతి లీగల్‌ : గంజాయి కలిగిన కేసులో ఏడుగురికి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ తిరుపతి రెండవ అదనపు జూనియర్‌సివిల్‌ జడ్జి పల్లపోలు కోటేశ్వరరావు సోమవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. తిరుమల ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో స్టేషన్‌ సీఐకి ఈనెల 26వ తేదీన ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఓ వ్యక్తి తిరుమలకు గంజాయి తీసుకెళుతున్నాడంటూ సమాచారం ఇచ్చాడు. సీఐ ఉన్నతాధికారుల అనుమతితో తిరుపతి అలిపిరి సమీపంలోని సప్తగిరి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. పదవ లైన్‌లో ఓ వ్యక్తి ప్రయాణికులతో కలిసి తప్పించుకోవడానికి ప్రయత్నించగా సీఐ అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. విచారణలో తిరుపతి మంగళం క్వార్టర్స్‌కు చెందిన జి.గంగాద్రిగా తేలింది. అనంతరం అతని వద్ద 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రేణిగుంట మండలం, కరకంబాడి తారకరామానగర్‌కు చెందిన వి.సక్కూబాయ్‌ అనే మహిళ వద్ద గంజాయి కొన్నట్టు తెలిపాడు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది ఆమె ఇంటి తనిఖీలు నిర్వహించి రూ.1.5 లక్షల విలువ చేసే ఒకటిన్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మంగళం బీటీఆర్‌ కాలనీ చెందిన ఎం.సూర్యప్రకాష్‌, కర్ణాటక చిక్‌బళ్లాపూర్‌ జిల్లా, మిద్దిళ్లుకు చెందిన తిమ్మప్పమహేష్‌, తిరుమల డీ–టైప్‌ క్వార్టర్స్‌కు చెందిన బి.రంజన్‌కుమార్‌ అలియాస్‌ సునీల్‌, జార్ఖండ్‌కు చెందిన అమిద్‌కుమార్‌యాదవ్‌, అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం, టీ సదుంకు చెందిన తళారి శివకుమార్‌ వద్ద 50 గ్రాముల చొప్పున గంజాయి ఉండడాన్ని గుర్తించారు. ఈ మేరకు ఏడుగురిపై కేసులు నమోదు చేసి సోమవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

అత్యాచారం కేసులో ఇద్దరికి రిమాండ్‌

ప్రేమపేరుతో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆమెను కులం పేరుతో ధూషించిన కేసులో కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పార్ల గ్రామానికి చెందిన జి.రాజకుమార్‌కు ఏప్రిల్‌ 10వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి గ్రంధి శ్రీనివాస్‌ సోమవారం ఆదేశాలు జారీచేశారు. నిందితుడు రాజకుమార్‌ తిరుపతి శివజ్యోతినగర్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పి ఆమెను శారీకంగా అనుభవించాడు. ఆమె పెళ్లి చేసుకోమనడంతో కులం పేరుతో దూషించాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు తిరుపతి దిశా పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని వార్తలు