అర్చకులుగా‘రాణి’స్తూ..!

28 May, 2023 11:26 IST|Sakshi

అవనిలో సగం.. ఆకాశంలో సగం.. ఏరంగంలోనైనా రాణిస్తాం.. అని నిరూపిస్తున్నారు నేటి నారీమణులు. ఒకప్పుడు వంటింటి కుందేళ్లుగా అణచివేతకు గురైన మహిళలు ఇప్పుడు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లోనూ ‘మేము సైతం’ అంటూ దూసుకుపోతున్నారు. అనాధిగా వస్తున్న సంప్రదాయాన్ని అందిపుచ్చుకుని అర్చకత్వంలోనూ రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో శుభకార్యాలు చేస్తూ విశిష్ట గౌరవాన్ని సంపాదించుకుంటున్నారు. ఆలయాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.. పిచ్చాటూరు మండలం, కీళ్లపూడి గ్రామానికి చెందిన మహిళా అర్చకులు.

సాక్షి, తిరుపతి డెస్క్‌: పిచ్చాటూరు మండలం, కీళపూడిలో శ్రీభవానీదేవి సమేత జలకంఠేశ్వరాలయం, శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయాలతో పాటు, పిచ్చాటూరులోని శ్రీనాగాలమ్మ దేవాలయాల్లో నిత్యపూజలు నిర్వహిస్తుంటారు. ఆయా ఆలయాల్లో కీళ్లపూడి గ్రామానికి చెందిన మహిళా అర్చకులే పూజలు చేస్తుంటారు. పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తుల మన్ననలు పొందుతున్నారు.

1993 నుంచి నిత్య పూజలు
1990లో అరణియార్‌ జలాశయం మధ్యలో కీళపూడి గ్రామానికి చెందిన హరిశ్చంద్ర రాజు పొలాన్ని దున్నుతుండగా శివలింగం బయటపడింది. ఈ శివలింగాన్ని ప్రాజెక్టు ఒడ్డున ఓ రావి చెట్టు కిందకు తరలించారు. మూడేళ్ల తర్వాత ఆ చెట్టు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేసి అందులో శివలింగాన్ని ప్రతిష్టించారు. అరణియార్‌ ప్రాజెక్టు జలం(నీరు) కింద శివలింగం లభించినందున శ్రీ భవానీ దేవి సమేత జలకంఠేశ్వర స్వామిగా నామకరణం చేశారు. ఇలా ఏర్పడ్డ ఈ ఆలయంలో నిత్యపూజలకు అదే గ్రామంలోని ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సరోజమ్మను అర్చకురాలిగా నియమించారు. అలా మొదలైన ఈ అర్చకత్వం తన భర్త బతికి ఉన్న సమయంలో ఆయన ద్వారా అర్చకత్వం అభ్యసించారు.

సరోజమ్మ తన పౌరోహిత పటిమతో ఆలయ అభివృద్ధికి తోడ్పడారు. ఆ సమయంలో ఆమెకు ఏడేళ్ల వయస్సు గల మనవడు సుబ్రమణ్యం, ఎనిమిదేళ్ల వయస్సు ఉన్న మనవరాలు కల్పన పూజలకు సహకరించేవారు. 2013లో మనవరాలు కల్పనకు వివాహం జరిగింది. 2014లో సరోజమ్మ కుమార్తె నాగమణి నాగమణి సైతం తల్లితో కలిసి జలకఠేశ్వర స్వామి ఆలయంలో నిత్యపూజల్లో పాల్గొంటూ అర్చకత్వం వైపు అడుగులు వేశారు. మనవరాలు కల్పన 2015లో తన భర్తతో కలిసి కీళపూడికి విచ్చేసి ఇక్కడే కాపురం పెట్టారు. ఆపై వృద్ధాప్యం కారణంగా 2017లో సరోజమ్మ శివైఖ్యం చెందారు. అప్పటి నుంచి తన మేనత్త నాగమణి, కోడలు కల్పన జలకంఠేశ్వర ఆలయంలో అర్చక స్వాములయ్యారు. తదనంతరం ఆలయ అభివృద్ధిలో భాగంగా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కూడా నిర్మించారు.

అభివృద్ధి పథంలో ఆలయాలు
మహిళా అర్చకులుగా ఉన్న ఆలయాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. సెంటు భూమిలో రేకుల షెడ్డులో ప్రారంభమైన కీళపూడిలోని శ్రీ జలకంఠేశ్వర ఆలయం ప్రస్తుతం సుమారు ఎకరం విస్తీర్ణంలో శివాలయంతో పాటు షిర్డీ సాయిబాబా ఆలయం, అనుబంధంగా ఓ కల్యాణ మండపం రూపుదిద్దుకుంది. ఆలయ సత్రంలో వివాహాలు, శుభకార్యాలు, తిరుమల యాత్రికులు సేద తీరడానికి విడిదిగా ఉపయోగపడుతోంది. పక్కనే ఉన్న అభయాంజనేయస్వామి ఆలయం మండలం ప్రారంభంలో, రోడ్డుకు ఆనుకొని ఉంది. ఈ కారణంగా భక్తులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు ఇక్కడ ఆపి పూజలు చేసి వెళ్తుంటారు. ఇక నాగమ్మ ఆలయ కుంభాభిషేకానికి గత నెల రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే ఆదిమూలం హాజరయ్యారు.

శుభకార్యాలకు అర్చకత్వం
ఆలయాల ద్వారా సుపరిచితులైన కల్పనను గృహ ప్రవేశాలు, సత్యనారాయణ వ్రతం, గణపతి హోమం వంటి పూజలకు ఆహ్వానిస్తుంటారు. వీటితో పాటు పెళ్లిళ్లు సైతం జరిపిస్తుంటారు.

ఆధ్యాత్మిక ‘కల్పన’
అదే గ్రామానికి చెందిన వెంకట్రాజు రిటైర్డ్‌ ఆర్టీసీ డ్రైవర్‌. ఉద్యోగ విరమణతో వచ్చిన రూ.9 లక్షల పాటు దాతల విరాళంతో 2019లో శివాలయం పక్కనే శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో అర్చకత్వ బాధ్యతలను కల్పనకు అప్పజెప్పారు. 2020లో పిచ్చాటూరు టీచర్స్‌ కాలనీ సమీపంలో స్వయంభు శ్రీ నాగాలమ్మ ఆలయం ఏర్పడగా.. అందులోనూ ఆమెనే అర్చకులుగా నియమించారు. ప్రస్తుతం ఈ రెండు ఆలయాల్లో కల్పన అర్చకులుగా నిత్యపూజలు చేస్తుండగా, శ్రీ జలకంఠేశ్వరాలయం, షిర్డీ సాయిబాబా ఆలయాల్లో నాగమణి అర్చకత్వం వహిస్తున్నారు.

అందరి ప్రోత్సాహం వల్లే
నా భర్తతో పాటు అందరి సహకారం వల్లే అర్చకత్వంపై ఆసక్తి పెరిగింది. దేవునిపై భక్తి శ్రద్ధలతో చేసే పని ఏదైనా నిష్టతో చేయాలన్నదే మా పెద్దలు నాకు నేర్పించారు. స్వామి వారి సేవలో అర్చకురాలిగా కొనసాగడం దేవుడు ఇచ్చిన వరం. రుతుక్రమం సమయంలో ఆలయానికి, అర్చకత్వానికి దూరంగా ఉంటా. గత ఏడేళ్లుగా గృహ ప్రవేశాలు, గణపతి హోమం, సత్యనారాయణ వ్రతం, ప్రభుత్వ భవనాలు ప్రారంభోత్సవాలకు వెళ్తున్నా.
–కల్పన, అర్చకురాలు, కీళపూడి గ్రామం

అమ్మ అర్చకత్వాన్ని కొనసాగిస్తా
మా అమ్మ సరోజమ్మ నాకు అప్పజెప్పిన అర్చకత్వాన్ని నా చివరి జీవితం వరకు కొనసాగిస్తాను. శ్రీ జలకంఠేశ్వర స్వామికి సేవచేస్తూ, ఆలయానికి వచ్చే భక్తులకు సేవలందిస్తా. ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా.
–నాగమణి, అర్చకురాలు, కీళపూడి

మరిన్ని వార్తలు