అలా బయటపడ్డారు... సీట్‌ రిజర్వేషన్‌ కోసం లాంగ్‌ జర్నీ టికెట్‌

5 Jun, 2023 10:36 IST|Sakshi

తిరుపతి అర్బన్‌: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. రైళ్లు.. బస్సులు విపరీతమైన రద్దీతో నడుస్తుంటాయి. ముఖ్యంగా రైళ్లలో తక్కువ దూరం ప్రయాణం చేసేవారికి సీట్‌ రిజర్వేషన్‌ దొరకడం అంత సులభం కాదు. చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది బెర్త్‌ రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ అయ్యేందుకు లాంగ్‌ జర్నీకి టికెట్లు తీసుకుంటుంటారు. తమ గమ్యం రాగానే మధ్యలో దిగేస్తుంటారు. ఇదే ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నుంచి తిరుపతి జిల్లాలో హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన వారిని కాపాడింది. ఈ విషయం గుర్తించడానికి రైల్వే అధికారులకు మూడు రోజులు పట్టింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దీనిపై పూర్తి స్పష్టత వచ్చింది. ప్రయాణికులంతా క్షేమంగా ఉండడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

తిరుపతి ప్రయాణికులు సురక్షితం
తిరుపతి మీదుగా వెళ్లిన హోరా ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి జిల్లా నుంచి 40 మంది ప్రయాణికులు జర్నీ చేశారు.అయితే ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ సమీపంలోని బహంగ్‌బాజర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతానికి అవతలి స్టేషన్‌ హోరాకు తిరుపతి నుంచి 8మంది,రేణిగుంట నుంచి 8మంది,గూడూరు నుంచి ఇద్దరు. మొత్తంగా 18 మంది టికెట్‌ తీసుకున్నారు. ప్రమాదం జరిగిన స్టేషన్‌కు ముందు స్టేషన్‌ బాలాసోర్‌కు తిరుపతి నుంచి 10 మంది టికెట్‌ తీసుకున్నారు.అయితే వీరంతా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ముందే దిగేసినవారే.

టికెట్‌ తీసుకుంది వీరే..
హోరా స్టేషన్‌కు తిరుపతి నుంచి టికెట్‌ తీసుకున్న వారిలో అజయ్‌ కేఆర్‌,కుమారి ప్రయాంక, కమలాదేవి, ఎం.కుమార్‌, అనురాగ కుమార్‌, భూపేంద్ర,యానియా,సోలారింగ్‌ ఉన్నారు. గూడూరు నుంచి హోరాకు టిక్కెట్‌ తీసుకున్న వారిలో ఎస్‌కే దాస్‌, దూలాల్‌ ఉన్నారు,రేణిగుంట నుంచి హోరాకు టిక్కెట్‌ తీసుకున్న వారిలో చంద్రమణి,శాల్వి,తేజా,లీలావతి,రాజా,డీఎస్‌ సాయి,సూచిట్‌,సుభామిత్ర ఉన్నారు.మొత్తంగా అంతా సురక్షితంగా ఉండడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ప్రయాణికులు క్షేమం
తిరుపతి నుంచి ఒడిశాకు ప్రయా ణం చేసిన వారు సురక్షితంగా ఉన్నారు. టికెట్లు ఒడిశా ప్రాంతానికి తీసుకున్నప్పటికి వారు మన రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో దిగేశారు. దీంతో వారి సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారింది. ఏమైనా రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం.
– సత్యనారాయణ, తిరుపతి రైల్వే స్టేషన్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు