ముగిసిన తుమ్మలగుంట బ్రహ్మోత్సవాలు

27 Sep, 2023 00:34 IST|Sakshi
చక్రస్నాన ఘట్టంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి దంపతులు, తుడా చైర్మన్‌ చెవిరెడ్డిమోహిత్‌రెడ్డి
● చక్రస్నానానికి భారీగా తరలి వచ్చిన భక్తులు ● ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం

చంద్రగిరి: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. చివరి రోజైన మంగళవారం ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం 7 నుంచి 9గంటల మధ్య చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కంకణభట్టార్‌ గిరిధర్‌ భట్టాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరింపజేశారు. చివరగా పుష్కరణిలో చక్రతాళ్వార్‌కు చక్రస్నానం చేయించారు.

తరలివచ్చిన భక్తజనం

చక్రస్నాన ఘట్టాన్ని తిలకిచేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. స్నపన తిరుమంజన కై ంకర్యాలు ముగిసిన తర్వాత వైఖానస ఆగమోక్తంగా స్వామివారి చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలను ఆచరించారు. చక్రస్నానం సందర్భంగా పుష్కరిణిలో స్నానమాచరించడం ద్వారా సకల సుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

ధ్వజావరోహణం

సాయంత్రం 5.30 నుంచి 7 గంటల మధ్య జరిగిన ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మి, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు ఆలయ సిబ్బంది, వేద పాఠశాల పిల్లలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు