Chinnayya Gutta History: ఎంత గట్టిగా చప్పట్లు కొడితే.. అంత నీరు

25 Oct, 2021 19:53 IST|Sakshi

రైతుల పాలిటి దేవుడు చిన్నయ్య

గిరిజనులకు ఆరాధ్య దేవుడు

గిరిజనులే ఇప్పటికి పూజారులు 

పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి

లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలంలోని హన్మంతుపల్లి గ్రామ పంచాయతి పరిదిలోగల చల్లంపేట గ్రామ శివారు  అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా  సుమారు 150 సంవత్సరాల క్రితం నుండి కొలువు పొందుతున్న గిరిజనుల ఆరాధ్య దేవుడు చిన్నయ్య దేవుడు. ఈ ప్రాంతంలో చిన్నయ్య దేవుడు ఎంతో ప్రసిద్ధి గాంచాడు. చారిత్రాత్మకంగా వెలిసిన చిన్నయ్య దేవుడు గిరిజనుల ఆరాధ్య దైవంగా ఇప్పటికి సేవలందుకుంటూనే ఉన్నాడు.

ప్రాచీన కాలంలో పాండవులు ఇక్కడ వ్యవసాయం చేసేవార..ని ద్రౌపది స్నానం చేయడానికి కొల్లుగుంటలు, పరుపుబండపైన వ్యవసాయం చేసినట్లు నాగళి సాళ్ళు, గుడి లోపల దొనలో పట్టె మంచం దేవుని విగ్రహాలు ఉన్నట్లు ఇప్పటికి పూర్వీకులు చెబుతుంటారు. వర్షాకాలం ప్రారంభం సమయంలో సుదూర ప్రాంతాల నుంచి దర్శనానికి వస్తుంటారు. రైతులు వరదపాశం బోనాలు వండి దేవునికి తీర్ధ ప్రసాదాలు వడ్డిస్తారు. పంట పొలాలకు వ్యాధులు సంభవిస్తే ఇక్కడి తీర్ధపు నీరు పంటపొలాలపై చల్లితే రోగాలు పోతాయనే నానుడి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 

వెల్లడానికి దారి....
పట్టణంనుండి చందారం గ్రామం మీదుగ 10 కిలోమీటర్లు వాహనాలపై  చల్లంపేట వరకు చేరుకుని అక్కడి నుండి అటవీ ప్రాంతం గుండా సుమారు 3 కిలో మీటర్లు కాలినడకన నడిచి వెల్తే చిన్నయ్య గుట్ట దేవుడి గుడిని చేరుకోవచ్చు. సమీప ప్రాంతంలో నీళ్ళ సదుపాయం చిన్నపాటి బుగ్గ వాగు లాంటిది ఉంటుంది అందులోని నీటిని త్రాగడానికి వాడుతారు. ఇప్పటికి అక్కడ గిరిజనులే పూజారులుగా కొనసాగుతుంటారు. ప్రతి ఆదివారం, గురువారం ఇక్కడ పూజలు పెద్ద మొత్తంగా  నిర్వహిస్తారు. వివిద గ్రామాలనుండి మేకలు, కొళ్ళు లాంటివి తెచ్చుకుని దేవుడికి బోనం వండి మొక్కలు చెల్లించి కొంచెం దూరంగా వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. 

చిన్నయ్య దేవుడి ప్రత్యేకత...
చిన్నయ్య దేవుడి ప్రత్యేకత ముఖ్యంగా పంట పొలాలు దుక్కి దున్నేముందు దేవుడి దర్శనం చేసుకుని బండారు(పసుపు) తెచ్చుకుని ధాన్యం వేసేటప్పుడు అందులో కలిపి వ్యవసాయం సాగు చేస్తారు. మరల పంట చేతికి వచ్చిన తర్వాత దినుసును దేవుడికి అప్పజెప్పి మొక్కిన మొక్కును చెల్లించుకుంటారు. వేసవి కాలం ముగుస్తుందనే సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది చిన్నయ్య గుడి. 

అల్లుబండ....
గుడిలో అల్లుబండ ప్రత్యేక స్థానాన్ని కల్గిఉంది. అక్కడికి వచ్చిన భక్తులు మనసులో  కొరికను కోరుకుని అల్లుబండ లేపితే సులభంగా లేచినట్లైతే కోరిక నెరవేరుతుందని అల్లుబండ బరువుగా ఉంటే కోరిక నేరవేరదనేది నమ్మకం. అల్లుబండ ప్రదేశం వద్ద భక్తులు వారి కొర్కెలను కోరుకుంటారు. 

చిన్నయ్య దేవుని గుడి వద్ద నుండి సుమారు మూడు కిలీమీటర్లు అటవీ ప్రాంతంలో నుండి నడుచుకుంటు వెల్లితే మంచు కొండలు దర్శనమిస్తాయి. అక్కడికి వెల్లిన భక్తులు ఎంత గట్టిగ చప్పట్లు, కేకలు, ఈళలు వేస్తే అంత నీరు కిందకు వస్తుంది. అక్కడి నీటిని భక్తులు తెచ్చుకుని పంటపొలాల్లో జల్లుకుంటే పంట దిగుబడి అధికంగా వస్తు చీడ, పీడలు రావని రైతుల నమ్మకం. 

పర్యాటక కేంద్రంగా తీర్చాలి....
పచ్చని అటవీ ప్రాంతం పక్షుల కిలకిల రావాలు, అడవి జంతువుల శబ్దాలు చూడడానికి వేసవి విడిదిగా అనిపించే చిన్నయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని పలువురు కోరుతున్నారు. రహదారి మధ్యలో మత్తడి నీటిని నిల్వచేసి వాటికి అనుకూలంగా రహదారిని ఏర్పాటు చేస్తే పుణ్యక్షేత్రంగాను పర్యాటక కేంద్రంగాను ఏర్పడుతుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు