పురాతన దేవాలయాలు.. పిల్లలమర్రి శివాలయాలు

9 Oct, 2021 20:30 IST|Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట): ఆ ఊరు పేరు వినగానే పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. అక్కడ కొలువైన శివుడు చెన్నకేశ్వరుడు  భక్త జనానికి ఆరాద్య దైవంగా వెలుగొందుతున్నారు. అంతేకాకుండా పురాతన దేవలయాలతో అలరారుతున్న ఆ గ్రామం అత్యంత ప్రఖ్యాతిగాంచింది. సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలోని కాకతీయ కళామతల్లికి నిలయమై, ఎన్నో శివాలయాలకు వేదికైంది.

"వాణి  నా రాణి" అని చెప్పి మెప్పించిన పిల్లలమర్రి పిన వీరభద్రుడిని తన బిడ్డగా నిలుపుకున్న కమనీయ సీమ పిల్లలమర్రి. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కి వెళ్లే 65వ నెంబర్‌ జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ముఖధ్వారం ఉంది. అంతేకాదు మూసీ కాలువ పక్క నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లంగానే  పిల్లలమర్రి గ్రామం వచ్చేస్తుంది.

(చదవండి: ఆలుమగల బంధానికి అర్థం చెప్పారు.. ‘ఇదీ బంధమంటే..!’)


శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు...
 పిల్లలమర్రి శివాలయాలు శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు. కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాలం ఈ గ్రామానికి నిజంగా స్వర్ణయుగం. రేచర్లరెడ్డి వంశీయులు కాకతీయులు సేనానులుగా, మహా సామంతులుగా ఆమనగల్లు, ఎలకతుర్తి, పిల్లలమర్రి ప్రాంతాలను పరిపాలించారు. మహాసామంతుడైన రేచర్ల బేతిరెడ్డి ఆమనగల్లును రాజధానిగా చేసుకుని పాలించే రోజుల్లో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించారు.

అనంతరం తన రాజధానిని పిల్లలమర్రికి మార్చి పిల్లలమర్రి బేతిరెడ్డిగా ప్రఖ్యాతి గాంచాడు. ఇప్పుడున్న గ్రామ ప్రాంతంలో పూర్వం ఒక గొప్ప వటవృక్షం (మర్రిచెట్టు) ఉండేది. అక్కడికి వేటకు వచ్చిన బేతిరెడ్డికి ఆ చెట్టు క్రింద ధనం లభించిందని, ఆ ధనంతో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించాడని ఒక కథ ప్రచారంలో ఉంది.


రాతి దూలాలపై పురాణ గాథాలు.....
క్రీ.శ 1195 నాటికి పిల్లలమర్రి బాగా ప్రసిద్ధి పొందింది. కాకతీయ రుద్రదేవుని మరణానంతరం తన తమ్ముడైన నామిరెడ్డికి మహాసామంత ఆధిపత్యం అప్పగించి బేతిరెడ్డి విశ్రాంతి తీసుకున్నాడు. రేచర్ల నామిరెడ్డి నిర్మించిన త్రికూటాలయంలో మూడు శివాలయాలున్నాయి. నామిరెడ్డి తన తండ్రిపేరు మీద కామేశ్వర, తన తల్లి పేరు మీద కాచేశ్వర, తన పేరు మీద నామేశ్వర లింగాలను ప్రతిష్టించాడు.

ఈ దేవాలయ ప్రాంగణంలో మరో నామేశ్వరాలయం కూడా ఉంది. అది 1202లో నిర్మించబడింది. తెలుగు భాష మాట్లాడేవారందర్నీ మొదటిసారిగా ఏకం చేసిన వారు కాకతీయులు. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరుకసాని  పిల్లలమర్రిలో తన పేరుమీద ఎరుకేశ్వరాలయాన్ని నిర్మించి శాసనం వేయించింది. ఆలయం సమీపంలో సుబ్బ సముద్రాన్ని తవ్వించింది. దేవాలయంలో పూజల నిమిత్తం భూధానం చేసింది. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతి దూలాలపై భారత రామాయణ గాథలు, సముద్ర మధనం, వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. 


సప్తస్వరాలు పలికే రాతి స్తంభాలు...
నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్త స్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తున్నాయి. నిర్మాణంలో ఇసుక పోసి ఏనుగులతో పెద్ద పెద్ద బండలను ఎక్కించినట్లు తెలిసింది.  దేవాలయాల్లో నల్లని శిలలపై నగిషీలు, పద్మాలు, హంసలు, నృత్య భంగిమలు,వాయిద్యకారుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 


శివరాత్రికి ఐదు రోజుల పాటు జాతర...
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది దేవాలయాలు శివరాత్రి శోభకు ముస్తాబు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 

(చదవండి: దేశానికే ఆదర్శం.. హైదరాబాద్‌)

మరిన్ని వార్తలు