పర్యాటక ప్రదేశాల ఖిల్లా.. సూర్యాపేట జిల్లా

27 Oct, 2021 17:44 IST|Sakshi

అందమైన కొండలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు నిలయం

ప్రాచీన కళలు, పురాతన కట్టడాలకు నెలవు

కనువిందు చేయనున్నఅపురూప శిల్పాలు, అరుదైన ప్రదేశాలు

దురాజ్‌పల్లి (సూర్యాపేట) : పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట జిల్లా అలరారుతోంది. జిల్లాలో అతి పురాతన  కట్టడాలు సంస్కృతికి అద్దం పడుతాయి. తెలంగాణ– ఆంద్రప్రదేష్‌ రాజాధానులకు 143 కిలో మీటర్ల సమాన దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో అనేక అపురూప కట్టడాలు పర్యాటక ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలు పర్యాటకులకు కను విందుగొలుపుతాయి. పురాతన కట్టడాలు, ఎతైన కొండలు, దట్టమైన అడవులు, ప్రాచీన శిలాయుగం నాటి రాక్షసగుళ్ళు, క్రీస్తు పూర్వం నాటి భౌద్దస్తూపాలు, కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధి శివాలయాలు, అపురూప శిల్పలు, మండపాలు, మూసి రిజర్వయర్‌ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట జిల్లా. 

కాకతీయుల కళ నైపుణ్యం అద్దం పటే పిల్లలమర్రి...
జిల్లా కేంద్రానికి 3 కిలో మీటర్ల దూరంలో 65 నెంబర్‌ జాతీయ రహదారికి 1 కిలో మీటర్‌ దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామం కాకతీయుల కాలంనాటి శివాలయాలు వారి కాల నైపుణ్యానిక అద్దం పడుతున్నాయి. క్రి.శ 1203లో కాకతీయ సామంతరాజు అయిన రేచర్ల వంశానికి చెందిన బేతిరెడ్డి పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించినట్లు శిలాశాసనాలు తెలుపుతున్నాయి. ఇక్కడ నిర్మించిన శివాలయాలు ఎంతో ప్రసిద్ది చెందాయి. ఎర్రకేశ్వర ఆలయం, త్రికూటేశ్వరాలయం, నామేశ్వరాలయాలు కాకతీయుల కళానైపుణ్యానికి అద్దం పడుతాయి. శిలాశాసనాలు, వైవిద్యభరితమైన శిల్పాలు ఈ ఆలయాలలో ఉంటాయి. సప్త స్వరాలను వినిపించే రాలిస్తంబం, రాతి కట్టడాలు ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయాలలో వార్షిక ఉత్సవాలు ఫిబ్రవరి– మార్చి మాసంలో జరుగుతాయి. ఇక పిల్లలమర్రి పినవీరభద్రుడు జన్మించిన గ్రామం పిల్లలమర్రి. 

ఫణిగిరిలో ప్రసిద్ధ భౌద్ధక్షేత్రం....
జిల్లా కేంద్రానికి 40 కిలో మీటర్ల దూరంలో జనగాం రహదారిపై ఉన్న ఫణిగిరి గ్రామం ప్రసిద్ద బౌద్ధక్షేత్ర పర్యాటక ప్రదేశంగా వెలుగొంతున్నది. ఫణిగిరి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో క్రీ. పూ 1–3 ఎడి శతాబ్దం నాటి భౌద మహాస్తూపం, మందమైన ఇటుకలతో నిర్మాంచిన చైత్యగదులు, విహారాలు, పాలరాతి శిల్పాలు,భౌద జాతక కథలతో చెక్కిన తోరణాలు, బ్రహ్మలిపిలో ఉన్న శిలా శాసనాలు ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతాయి. పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో రోమన్‌ రాజుల కాలంనాటి బంగారు, వెండి, గాజు, రాగి, నాణాలు దొరికాయి. వీటియి కొండపై భద్రపరిచారు. ఇలా తొవ్వకాలలో బయటపడిన వస్తువులు ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లకు ఆధారాలుగా నిలుస్తున్నాయి

పురాతన గిరిదుర్గం.. ఉండ్రుగొండ ప్రసిద్ధి
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పొడవైన పురాతన గిరిదుర్గంగా ప్రసిద్ధి పొందిన కట్టడాలు ఉన్న ప్రాంతం ఉండ్రుగొండ. జిల్లా కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉండ్రుగొండ చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు.  చుట్టు కొండలు, దట్టమైన అడవి మద్య  ఆద్యత్మికత ఉట్టి పడే విధంగా లక్ష్మీ నర్సింహ్మస్వామి ఆలయం ఉంటుంది. దేశంలోనే ప్రసిద్ధి  పొందిన ఉండ్రుగొండ కోట చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. 

1370 ఎకరాల విస్తీర్ణంలో నిగనిగలాడే చెట్ల చెట్ల మద్య 9 కొండలను కలుపుతూ 14 కిలో మీటర్ల పొడవులన నిర్మించిన ఎత్తైన దుర్గప్రాకారాలు, కొలనులు, కొండపైన ఉన్న గొలుసుకట్టు నీటి కుంటలు, గృహాల దార్మికతను వెల్లివిరిసే పురాతన దేవాలయాలు ఉండ్రుగొండ ప్రత్యేకత. శాతవాహనులు, కళ్యాణచాళుక్యులు, కాకతీయులు, కుతుబ్‌షాహాన్‌లు, రేచర్లరెడ్డి రాజులు, పద్మనాయకులు ఈ కోటను అభివృధ్ది చేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. 

ఈ గుట్టలపై శ్రీ లకక్ష్మీ నరసింహస్వామి,  గోపాలస్వామి, కాలభైరవుడు, రాజభవనాలు, నర్తకీమణుల గృమాలు, బోగందానిగద్దెమంటపం, చాకలిబావి, మంత్రిబావి, నాటి చారిత్రక వైభవానికి ప్రతీకలుగా ఉన్నాయి. కొండపై నుంచి నాగుల పాహడ్‌శివాలయం వరకు సొరంగమార్గం ఉండేదని ఈ ప్రాంత ప్రజలు చెపుతుంటారు. 

తెలంగాణ అతి పెద్ద జాతర... పెద్దగట్టు లింగన్న జాతర
తెలంగాణలో సమ్మక్క– సారలమ్మ జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతర జరిగేది సూర్యాపేట జిల్లాలోనే. సూర్యాపేటకు 7 కిలో మీటర్ల దూరంలో దురాజ్‌పల్లి గ్రామంలో ఉన్న పెద్దగట్టు(గొల్లగట్టు) ఏటేటా అభివృద్ధిచెందుతూ పర్యాటక ప్రదేశంగా ఎదుగుతున్నది. ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కోరిన మొక్కులను తీర్చే స్వామిగా పేరొందిన లింగన్న దర్శనానికి  ఇప్పుడు ప్రతి రోజు భక్తులు వస్తున్నారు. 

మత సమైక్యతకు చిహ్నం.. జానపహడ్‌ దర్గా..
కుల  మతాలకు అతీతంగా దర్శించుకునే ప్రదేశం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్‌పహడ్‌ దర్గా.. 4 శతాబ్దాల చరిత్ర గల ఈ ధర్గాలో హజ్రత్‌ సయ్యద్‌ మోహినుద్ధీన్‌షా, జాన్‌సాక్‌షహిద్‌రహమత్తుల్లా సమాధులు ఉన్నాయి. ఈ దర్గాను మానవత్వనికి, త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. ఇక్కడ ఉర్సు సందర్భంగా పంచే గందానికి ప్రత్యేకత ఉంది. ఈ దర్గా పర్యాటక ప్రదేశంగా కొనసాగుతున్నది.


 ఇవే కాకుండా  ప్రత్యేక గల అనేక దేవాలయాలు, కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. నాగులపహడ్‌ శివాలయం, మట్టంపల్లి లక్ష్మినర సింహస్వామి ఆలయం, సూర్యాపేట వెంకటేశ్వరస్వామి దేవాలయ, మిర్యాలలో సీతరామచంద్రస్వామి  దేవస్థానం, అర్వపల్లిలో  లక్ష్మినరసింహస్వామి ఆలయం, దర్గా తదితర ప్రదేశాలు పర్యాటక శోభను సంతరించుకున్నాయి. 

మరిన్ని వార్తలు