Kamareddy: శిశువుల తారుమారు

12 Oct, 2021 22:00 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్‌): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒకరికి ఇవ్వాల్సిన శిశువును మరోకరికి ఇచ్చారు. వారు ఆ శిశువులను తమ ఇంటికి తీసుకెళ్లారు. మరో శిశువు బంధువులు గుర్తించి తారు మారు అయ్యారని గుర్తించి ఆసుపత్రి నిర్లక్ష్యంపై ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు గంటలకు పైగా ఆసుపత్రిలో ఆందోళన కోనసాగింది.

చివరికి పోలీసులు వచ్చి ఇంటికి తీసుకెళ్లిన శిశువును రప్పించి విచారణ జరిపి ఇద్దరు శిశువులను వారి తల్లి వద్ద అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న చరణ్‌దాస్, నిఖిత దంపతులు. నిఖిత జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఈనెల 8 వ తేదిన సీజెరియన్‌ అయి మగ శిశువుకు జన్మనిచ్చింది. బాబు ఆరోగ్యం బాగాలేకపోవడంతో గోదాంరోడ్‌లోని జననీ పిల్లల దావాఖానలో ఐసీయూలో అడ్మిట్‌ చేసి చికిత్స అందిస్తున్నారు.

గాంధారి మండలం కడక్‌వాడి గ్రామానికి చెందిన శ్రీకాంత్, నిఖిత దంపతులు. నిఖిత ఈనెల 11వ తేదిన కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సాధారణ కాన్పుతో మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు తక్కువ బరువుతో అనారోగ్యంగా ఉండటంతో అదే ప్రైవేట్‌ పిల్లల ఆసుపత్రిలో ఐసీయూలో అడ్మిట్‌ చేశారు. ఇద్దరు శిశువులను మంగళవారం రోజున డిశ్చార్జీ చేయాల్సి ఉంది.

అయితే మధ్యాహ్నం కామారెడ్డి పట్టణానికి చెందిన శిశువును కడక్‌వాడి గ్రామానికి చెందిన బంధువులకు అప్పగించారు. ఈ క్రమంలో.. శిశువు అమ్మమ్మ గారి  ఇల్లు రాజంపేట్‌ మండలం ఆర్గోండ గ్రామానికి తల్లి, శిశువును తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటలకు కామారెడ్డి పట్టణానికి చెందిన వారికి మరో శిశువును అప్పగించారు. శిశువుల ఫైళ్లు కూడా తారుమారు అయ్యాయి. దీంతో గమనించిన కామారెడ్డికి చెందిన బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.

దీంతో గంట పాటు ఆందోళన చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆర్గోండకు తీసుకెళ్లిన శిశువును ఆసుపత్రికి రప్పించి విచారణ జరిపారు. రాత్రి ఏడున్నర గంటలకు ఇద్దరు శిశువులను వారి బంధువులకు అప్పగించారు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. రూరల్‌ సీఐ చంద్రశేకర్, పట్టణ పోలీసులు విచారణల జరిపి ఇరువర్గాల వారిని, ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి శాంతింప చేశారు. నిర్లక్ష్యగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై ఇరువర్గాల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు