ఊహించని ప్రమాదం.. తండ్రితో కలిసి కాలేజీకి వెళ్తుండగా...

9 Oct, 2021 09:01 IST|Sakshi
ఠాగూర్‌(ఫైల్‌)  

కరుణగిరి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ

కుమారుడి మృతి, తండ్రీ కుమార్తెలకు తీవ్రగాయాలు

డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణం

సాక్షి, ఖమ్మం: లారీ డ్రైవర్‌ మద్యం మత్తు ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిర్లక్ష్యంగా లారీ నడపడంతో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం రూరల్‌ మండలంలోని కరుణగిరి సమీపంలో వరంగల్‌– అశ్వారావుపేట ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన ఎనగందుల దేవయ్య అదే మండలంలోని పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్నాడు. ఖమ్మంరూరల్‌ మండల పరిధిలోని సాయికృష్ణ నగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి కుమారుడు ఠాగూర్‌(18), కుమార్తె పవిత్ర ఉన్నారు. వారిద్దరూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ, మొదటి సంవత్సరాలు చదువుతున్నారు. 
చదవండి: వారి వయసంతా 25 లోపే.. అన్నీ హైస్పీడ్‌ స్పోర్ట్స్‌ బైక్‌లే

పిల్లలను కాలేజీలో దిగబెట్టడానికి వెళ్లి..
కళాశాలలో దిగబెట్టేందుకని పిల్లలిద్దరినీ తీసుకొని దేవయ్య శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గం మధ్యలోని కరుణగిరి సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ టైర్‌ ఠాగూర్‌ నడుముపై నుంచి వెళ్లడంతో కిడ్నీలు బయటకు వచ్చి అక్కడికక్కడే మృతిచెందాడు.

దేవయ్య, పవిత్రలపై నుంచి కూడా లారీ వెళ్లడంతో ఇద్దరికీ తీవ్ర గామాలమ్మాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు 108కి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి లారీ సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య

పిండిప్రోలులో ఠాగూర్‌ అంత్యక్రియలు..
కాగా మృతుడు ఠాగూర్‌ అంత్యక్రియలు స్వగ్రామం పిండిప్రోలులో జరిగాయి. ఓ పక్క తండ్రీ కుమార్తె తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఉండగా ఠాగూర్‌ అంత్యక్రియలను తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు బాధాతృప్త హృదయాలతో నిర్వహించారు. ఉన్నత చదువులు చదివి తమను సంతోషంగా చూసుకుంటావని అనుకుంటే కానరాని లోకాలకు వెళ్లిపోయావా కొడకా అంటూ ఠాగూర్‌ తల్లి రోదిస్తుంటే అక్కడున్న వారు కన్నీరుమున్నీరయ్యారు.

మరిన్ని వార్తలు