లాభదాయక ప్రత్నామ్నాయ పంట.. ఆవాలతో అధిక రాబడి!

17 Oct, 2021 09:22 IST|Sakshi

ప్రత్యామ్నాయ పంటల ఆదాయాలపై నివేదిక తయారు 

ప్రభుత్వానికి అందజేసిన వ్యవసాయ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: రబీ సీజన్‌లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి సూచిస్తోంది. అయితే వరి సాగులో ఆరితేరిన మన రైతాంగానికి కొత్త పంటల సాగుపై అవగాహన తక్కువని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. లాభదాయక ప్రత్నామ్నాయ పంటల గురించి ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అయ్యే ఖర్చు, రాబడిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక నివేదిక తయారు చేసింది.


వరి పంట బదులు ఏయే పంటలు సాగు చేస్తే ఎంత లాభం వస్తుందనే దానిపై వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతినిధుల సహకారంతో పంటల వారీగా పెట్టుబడి, లాభాల తీరును ఆ నివేదికలో పొందుపర్చింది. వ్యవసాయ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదికను సమర్పించింది. ప్రత్యామ్నాయ పంటల్లో ఆవాలకు ఎక్కువ లాభాలు వస్తున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. ఆ తర్వాత అధిక లాభాలు వచ్చే వరుసలో మినుములు, శనగ, నువ్వుల పంటలున్నాయి. అతి తక్కువ లాభం వచ్చే కేటగిరీలో కుసుమ పంట ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించింది. అయితే రబీ సీజన్‌ పంటల సాగుపై వ్యవయసాయ శాఖ ఇంకా తన ప్రణాళికను విడుదల చేయలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలువురు సభ్యులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేయగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందిస్తూ నవంబర్‌ మొదటివారంలో ప్రణాళిక విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నెలాఖరు నాటికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. పంటల వారీగా సాగు విధానాన్ని వివరిస్తూ కరపత్రాలు, వాల్‌పోస్టర్లు సైతం తయారు చేస్తోంది.

మరిన్ని వార్తలు