లక్కీ ‘పార్సిల్‌’: దక్షిణ మధ్య రైల్వే రికార్డు

8 Oct, 2021 09:22 IST|Sakshi

ఆరు నెలలకే రూ.109 కోట్ల ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: పార్సిళ్ల రవాణా విషయంలో చేసిన మార్పు రైల్వేకి కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో సాధారణ ప్రయాణికుల రైళ్లకు ఒకటి రెండు చొప్పున పార్సిల్‌ బోగీలను జత చేసేవారు. లగేజీ బుక్‌ చేసుకునేవారు వాటిల్లో తమ పార్సిళ్లను పంపేవారు. వ్యాపారులు బుక్‌ చేసిన ప్యాక్డ్‌ సరుకును వాటిల్లో గమ్యం చేర్చేవారు. దీనివల్ల సాలీనా రూ.80 కోట్ల నుంచి 90 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. ఇటీవల కోవిడ్‌ సమయంలో ఇలాంటి సరుకు తరలింపునకు పూర్తి రైళ్లను కేటాయించారు. ఈ మార్పు వ్యాపారులను బాగా ఆకట్టుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలలకే 2.56 లక్షల టన్నుల సరుకు తరలింపుతో ఏకంగా రూ.109.06 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఉత్సాహంగా మిగతా కాలానికి మరింత ఆదాయం వచ్చేలా రైల్వే అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈమేరకు తాజాగా లెక్కలు రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి రూ.108.35 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రికార్డుగా నిలిచింది. ఇప్పుడు దాన్ని కేవలం ఆరు నెలల కాలంలోనే బ్రేక్‌ చేయటం విశేషం.

వేగంగా.. తక్కువ ఖర్చుతో.. 
కోవిడ్‌ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో ప్రయాణికుల రైళ్లు చాలాకాలం నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు సరుకు రవాణా రైళ్లపై అధికారులు దృష్టి సారించారు. సిమెంటు, బొగ్గు, స్టీల్‌ వంటి వాటి కోసం పూర్తిస్థాయి గూడ్సు రైళ్లను నడిపినట్టుగానే, ఇతర సరుకు కోసం పూర్తిస్థాయి పార్సిల్‌ రైళ్లను నడపాలని నిర్ణయించి వ్యాపారులతో సంప్రదింపులు చేపట్టారు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. వేగంగా, తక్కువ ఖర్చుకే గమ్యస్థానం చేరుస్తామని హామీ ఇవ్వటంతో వ్యాపారులు ముందుకొచ్చారు. పండ్లు, ఉల్లిపాయలు, కోడిగుడ్లు, పాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేశారు.

ఏప్రిల్‌ నుంచి సెపె్టంబరు 27 వరకు 343 కిసాన్‌ రైళ్లను నడిపి ఉల్లిపాయలు, మామిడి పళ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు 1,08,388 టన్నుల మేర సరఫరా చేశారు. దీనివల్ల రూ.49.43 కోట్ల ఆదాయం వచ్చింది. దేశ రాజధానికి దూద్‌ దురంతో రైళ్ల ద్వారా 3.78 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేయటం ద్వారా రూ.8.91 కోట్ల ఆదాయం సమకూరింది. కోడిగుడ్లు, బేబీ డైపర్స్, ఎంఆర్‌ఎఫ్‌ టైర్లు ఇలా చాలా పార్సిళ్లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసింది. పార్సిల్‌ రవాణా ద్వారా రికార్డుస్థాయి ఆదాయం పొందడంలో అధికారులు చూపిన చొరవ అభినందనీయమని, భవిష్యత్తులో మరింత ఆదాయం కోసం కృషి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా చెప్పారు. 

మరిన్ని వార్తలు