ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే మిర్చిబజ్జి !

14 Dec, 2021 18:04 IST|Sakshi

రోజూ ఐదు వేలకు పైగా అమ్మకం...

యాబై ఏళ్లుగా మిర్చిబజ్జి దందా

ఏడు పదుల వయసులోనూ అదే జీవితం

సత్యనారాయణ, ఊర్మిల దంపతులు ఆదర్శం

సాక్షి, కామారెడ్డి: నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటాయి. ఏది కొనాలన్నా అగ్గిపిరమే. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ ఊళ్లో రూ. 1 కి ఒక మిర్చిబజ్జి అమ్ముతున్నారు. మీరు చదివేది నిజమే.  యాబై ఏళ్ల క్రితం మొదలైన వాళ్ల దందా ఏడు పదుల వయసులోనూ నిరాటంకంగా కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఆముద సత్యనారాయణ–ఊర్మిల దంపతులు యాబై ఏళ్ల కిందట మిర్చిబజ్జీల అమ్మకాలు మొదలుపెట్టారు. అప్పట్లో అంగళ్లలో, పండుగ ఉత్సవాల్లో వేడివేడి బజ్జీలు తయారు చేస్తూ అమ్ముతుండేవారు. మిగతా రోజుల్లో రాజంపేట గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద బండీపై పెట్టుకుని అమ్మేవారు.

అయితే వయస్సు పైబడడంతో బయటకు వెళ్లడం మానేశారు. ఇంటి దగ్గరే పొయ్యిమీద మిర్చీలు గోలించి బండిపై పెట్టుకుని అమ్ముతున్నారు. ప్రతీ రోజూ ఐదు వేలకు పైగా మిర్చిలు అమ్ముడవుతాయిని సత్యనారాయణ పేర్కొన్నారు. ఒక్కోసారి ఎనిమిది వేల నుంచి పది వేల దాకా అమ్ముడుపోతాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు అంటే దాదాపు 12 గంటల పాటు శ్రమిస్తారు. సత్యనారాయణ కొడుకు రాము బీఈడీ పూర్తి చేశాడు. ఉద్యోగాల నోటిఫికేషన్‌ రాకపోవడంతో తండ్రికి తోడుగా మిర్చిబజ్జీ దందాలో భాగమవుతున్నాడు. రాజంపేట మండల కేంద్రంలో సత్యనారాయణ దగ్గర మిర్చిబజ్జీల కోసం జనం ఎగబడతారు. ప్రతీ రోజూ తయారీ అమ్మకం సాగిస్తుంటారు. నలుగురు కలిస్తే చాలు మిర్చిలు తెప్పించుకుని తినడం ఆ ఊరిలో చాలా మందికి అలవాటు. దీంతో సత్యనారాయణ మిర్చిల దందా నిరాటంకంగా సాగుతోంది. 

అప్పుడు ఏకాన...ఇప్పుడు ఏక్‌ రూపియే
నాలుగైదు దశాబ్దాల నాడు సత్యనారాయణ దంపతులు మిర్చిదందా మొదలుపెట్టినపుడు ఏకాణాకు ఒక మిర్చి అమ్మేవారని సత్యనారాయణ తెలిపారు. రూపాయికి 16 అణాలు కాగా, ఒక్క రూపాయికి 16 మిర్చిలు ఇచ్చేవారమని పేర్కొన్నారు. తరువాత రూపాయకి నాలుగు, ఆ తరువాత రూపాయికి రెండు మిర్చిలు అమ్మామని,  ఇప్పుడు ఒక్క రూపాయికి ఒక మిర్చి అమ్ముతున్నట్టు పేర్కొన్నారు. 

శనగ పప్పు, బియ్యంతో కలిపి పిండితయారీ....
సత్యనారాయణ మిర్చిల కోసం శనగ పప్పుతో పాటు బియ్యం కలిపి గిర్నీ పట్టిస్తాడు. క్వింటాళ్ల కొద్ది పిండి పట్టించి మిర్చిల తయారీకి వాడుతున్నారు. అప్పట్లో రూ.2.50 కి కిలో నూనె, రూ.1.25 కు కిలో పప్పు దొరికే దని, ఇప్పుడు రూ.140 కిలో పామాయిల్, రూ.65 కిలో శనగపప్పు దొరుకుతున్నాయని తెలిపాడు. అప్పట్లో రూపాయికి కిలో పచ్చిమిర్చి దొరికేది, ఇప్పుడేమో రూ.40 నుంచి రూ.80 వరకు కొంటున్నామని పేర్కొన్నాడు. కొంత కాలం గ్యాస్‌ పొయ్యి మీద మిర్చిలు గోలించామని, అయితే గ్యాస్‌ ధర భాగా పెరగడంతో మళ్లీ కట్టెల పొయ్యిమీదనే చేయాల్సి వస్తోందని తెలిపాడు.

చదవండి: Kalyana Lakshmi Scheme: 50 ఏళ్ల కింద పెళ్లయిన వారికి.. ‘కల్యాణలక్ష్మి’!

మరిన్ని వార్తలు