టార్గెట్‌ రిజల్ట్స్‌.. 100 శాతం ఫలితాలు సాధించే బడులకు ప్రోత్సాహకాలు

31 Oct, 2022 00:43 IST|Sakshi

వంద శాతం రిజల్ట్‌ సాధిస్తే ప్రోత్సాహకాలు

విద్యార్థుల సామర్థ్యంపై తరచూ పరిశీలన

కనీసం 80 శాతం మందికి పాఠాలు అర్థమైతేనే సిలబస్‌లో ముందుకు.. 

అవసరమైతే వెనుకబడినవారికి ప్రత్యేక క్లాసులు 

వచ్చే ఐదు నెలలు టీచర్లు కష్టపడాల్సిందేనంటూ విద్యాశాఖ ఆదేశాలు 

టీచర్ల కొరత తీర్చకుండా లక్ష్యాలేమిటంటూ ఉపాధ్యాయ వర్గాల ఆగ్రహం! 

సాక్షి, హైదరాబాద్‌:  పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసింది. నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే బడులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని.. ఫలితాల సాధన దిశగా జిల్లా అధికారులకు టార్గెట్లు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే వార్షిక పరీక్షల తేదీలను ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ.. ఫలితాలు తక్కువగా ఉండే బడుల వివరాలను సేకరిస్తోంది. ఆయా స్కూళ్లలో ఫలితాలు తక్కువగా ఉండటానికి కారణాలను విశ్లేషిస్తూ నివేదికలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు సరిగా జరగలేదు. 2021లో పరీక్షలు లేకుండానే అందరినీ పాస్‌ చేశారు. 2020లోనూ పరీక్షలు రాసినవారి వరకు ఉత్తీర్ణులుగా ప్రకటించారు. కరోనా కాలంలో బోధన జరిగా జరగకపోవడమే దీనికి కారణం. అయితే ఈ ఏడాది సకాలంలో బడులు తెరిచారు. సిలబస్‌ కూడా సకాలంలో పూర్తవుతుందని భావిస్తున్నారు. అంతర్గత పరీక్షలన్నీ నిర్వహించడం వల్ల వార్షిక ఫలితాలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారనే అభిప్రాయంతో విద్యాశాఖ ఉంది. 

సన్నద్ధతకు ప్రత్యేక చర్యలు 
ఈసారి పదో తరగతిలో ఉన్న విద్యార్థులంతా కరోనా కాలంలో 8, 9 తరగతులు చదివినవారే. ఆ రెండేళ్లు విద్యా సంస్థలు సరిగా తెరవక, బోధన జరగక అభ్యసన నష్టాలు ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది. దానిని సరిచేయడానికే బ్రిడ్జి కోర్సులు నిర్వహించింది. అంతకు ముందు విద్యార్థులు చదివిన తరగతుల్లో వెనుకబడిన పాఠాలను మళ్లీ బోధించారు. కానీ దీని నుంచి ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.

విద్యాశాఖ అంతర్గత సర్వేలోనూ ఇది వెల్లడైంది. ఈ క్రమంలోనే క్లాసులో కనీసం 80 శాతం విద్యార్థులకు పాఠం అర్థమైతేనే సిలబస్‌లో ముందుకెళ్లాలని విద్యాశాఖ ఆదేశించింది. సరిగా అర్థంకాని విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఒక గంట ప్రత్యేక క్లాసులు తీసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు పుస్తకాలు సరిగా అందకపోవడం, ఇతర కారణాలతో బోధన సరిగా సాగలేదని భావిస్తున్నారు.

కాబట్టి వచ్చే ఐదు నెలల పాటు ప్రత్యేక బోధనపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ పేర్కొంది. అంతర్గత పరిశీలనలో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక బోధన చేపట్టాలని.. ప్రతి వారం వారి పురోగతి అంచనా వేయాలని సూచించింది. నెల రోజుల్లో వారి సామ ర్థ్యాన్ని గుర్తించి, అప్పటికీ పురోగతి లేకపోతే మరో సారి ప్రత్యేక బోధన చేపట్టాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకుపైగా బడుల్లో టెన్త్‌ ఫలితాలు గతం కన్నా తగ్గే అవకాశం ఉందని.. జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించింది. 

సబ్జెక్టు టీచర్లు లేకుండా ఎలా? 
టెన్త్‌ ఫలితాల సాధనకు టార్గెట్లు పెడుతున్న అధికారులు.. క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికీ 10వేల బడుల్లో ఏదో ఒక సబ్జెక్టు టీచర్‌ కొరత ఉందని, హైస్కూల్‌ టీచర్లను ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేస్తున్నారని చెప్తున్నారు. అభ్యసన నష్టాలను ఈ ఐదు నెలల్లో ఎలా భర్తీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు.

విద్యాశాఖలో దాదాపు 18 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని.. ఈ ఏడాది విద్యా వలంటీర్లను కూడా నియమించలేదని గుర్తుచేస్తున్నారు. మరోవైపు ఎంఈవోలు, డీఈవోల పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయి 
పరిశీలన ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. 

హైస్కూల్‌ హెచ్‌ఎంలకు ఎంఈవోగా బాధ్యతలు అప్పగిస్తున్నారని, బోధనపై దృష్టి పెట్టే అవకాశం లేకుండా చేస్తున్నారని పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయి టీచర్ల కొరత పరిష్కరించకుండా, ఫలితాల కోసం టార్గెట్లు పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు.  

మరిన్ని వార్తలు