రుణమాఫీ గజిబిజి

27 Sep, 2023 07:34 IST|Sakshi
డీసీసీబీ బ్యాంకు

మోమిన్‌పేట: రూ.లక్ష రుణమాఫీ గందరగోళంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒకరికి మాఫీ కావడం, మరొకరి కాకపోవడంతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని అందోళన వ్యక్తంచేస్తున్నారు. 2020 సంవత్సరం.. రూ.25వేల నుంచి రూ.50వేల వరకు కొంతమంది రైతులకు 2022 వరకు రుణమాఫీ అయింది. 2023 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ నెలాఖరులోగా మాఫీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసేందుకు మరో రెండు రోజుల సమయమే ఉంది. కానీ ఇప్పటి వరకు చాలా మందికి మాఫీ కాలేదు. దీంతో కొందరు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం మాఫీ చేస్తుందా.. లేక చేతులు దులుపుకొంటుందా అని విమర్శించారు.

సమాచారం ఇచ్చేవారు లేక..

2018 డిసెంబరు 11నాటికి ఉన్న రుణాలను రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రూ.25 వేలు ఉన్న రైతులకు ఇప్పటికీ మాఫీ కాలేదు. కానీ రూ.లక్ష రుణం ఉన్న రైతులకు మాఫీ అయింది. ఇది ఎలా సాధ్యమని, అంతా గజిబిజిగా ఉందని కర్షకులు వాపోతున్నారు. ఏ ప్రణాళికతో ప్రభుత్వం మాఫీ చేస్తోందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై వ్యవసాయ అధికారులను సంప్రదించగా.. 2018 డిసెంబరు11 వరకు రుణాలు తీసుకున్న రైతులు మాఫీకి అర్హులని చెప్పారని, బ్యాంకర్లను అడిగితే అంతా పై నుంచే, మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా సంబంధిత అధికారులను రుణమాఫీ గురించి అడగగా సరైన సమాచారం లేక పోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

అరకొరే మాఫీ

మండల కేంద్రంలోని యూనియన్‌ బ్యాంకులో అర్హత కలిగిన పంట రుణాల ఖాతాలు 3,235 ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 1,200 ఖాతాలకు మాత్రమే మాఫీ అయింది. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో 1,952 ఖాతాలు ఉండగా.. 800 లకు మాఫీ జరిగింది. పీఏసీఎస్‌ మోమిన్‌పేటలో 1,373 పంట రుణ ఖాతాలకు రూ.4.02 కోట్లు రుణమాఫీ కావాల్సి ఉండగా.. 911 ఖాతాలకు రూ.2.54కోట్లు మాత్రమే మాఫీ అయింది. పీఏసీఎస్‌ మేకవనంపల్లిలో 1,082 ఖాతాలకు రూ.5.14 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా.. 780ఖాతాలకు గాను రూ.3.61కోట్లు మాఫీ వచ్చింది. దీంతో ప్రభుత్వం చెప్పిన గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. పూర్తిగా మాఫీ జరుగుతుందో నని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఉన్నాతాధికారులు రుణమాఫీ ప్రణాళికపై రైతులకు ఉన్న సందేహాన్ని తీర్చాలని వారు కోరుతున్నారు.

సమాధానం దొరకని ప్రశ్నలతో అన్నదాతల ఉక్కిరిబిక్కిరి గడువు ముంచుకొస్తున్నా.. గోడువినని వ్యవసాయాధికారులు సరైన సమాచారం లేక.. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు సగం మందికే మాఫీఅయిందంటున్న కర్షకులు

పూర్తి వడ్డీ చెల్లిస్తున్నా..

యూనియన్‌ బ్యాంకులో 2016లో రూ.86వేల పంటరుణం తీసుకున్న. యేటా రెన్యూవల్‌ చేయిస్తున్న. రైతులకు ఇస్తున్నామంటున్న పావలా వడ్డీ రావడం లేదు. పూర్తి వడ్డీ చెల్లిస్తున్నా. రుణమాఫీ కాలేదు. బ్యాంకు అధికారులను అడిగాను. సరైన సమాధానం రావటం లేదు. నా తోటి రైతుల్లో కొంత మందికి రూ.లక్ష మాఫీ వచ్చింది. ఇదెలా సాధ్యం. అంతా అయోమయంగా ఉంది.

– నజీర్‌ అహ్మద్‌, రైతు, ఎన్కేపల్లి

మనుగడ లేని ఖాతాలను

సరిచేస్తున్నాం

కొన్ని ఖాతాలు మనుగడలో లేకపోవడంతో మాఫీ డబ్బులు ప్రభుత్వానికి తిరిగి వెళ్తున్నాయి. అలాంటి ఖాతాలకు వారి వార సుల ఆధార్‌ కార్డులను జత చేసి బ్యాంకర్లకు అందజేస్తున్నాం. ప్రభుత్వం విడతల వారీగా మాఫీ నిధులు బ్యాంకులకు నేరుగా పంపిస్తోంది. ఒకరికి మాఫీ కావడం, మరొకరికి కాకపోవడం సందేహంగానే ఉంది.

–జయశంకర్‌, వ్యవసాయ అధికారి, మోమిన్‌పేట

మరిన్ని వార్తలు