పైలెట్‌.. దూకుడు!

17 Nov, 2023 04:20 IST|Sakshi
రోడ్‌షోలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు: పైలెట్‌ (పంజుగుల) రోహిత్‌రెడ్డి.. ఈ పేరు వింటే.. తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో గుర్తు పట్టని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. రోహిత్‌రెడ్డి స్వగ్రామం తాండూరు నియోజకవర్గం ఇందర్‌చెడ్‌. 2009లో రాజకీయాలపై ఆసక్తితో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. అప్పటి ఎన్నికల్లో కేవలం 270 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓడిన చోటే గెలవాలన్న కసితో ఉన్న రోహిత్‌.. నాటి నుంచి తాండూరులో పట్టుకోసం కుస్తీ చేశారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూ.. ప్రజలకు దగ్గరయ్యారు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. అయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా ప్రజల మధ్యే ఉన్నారు. 2018లో కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ నుంచి టికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డిపై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. కాంగ్రెస్‌లో ఉంటే తాండూరు అభివృద్ధి సాధ్యం కాదని భావించిన ఆయన.. అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో టికెట్‌ కోసం మంత్రి పట్నంతో పైలెట్‌ పోటీ పడ్డారు. అయితే సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు ఉండటంతో తాండూరు సీటు రోహిత్‌ను వరించింది.

తక్కువ సమయంలో ఎక్కువ ప్రగతి

తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తీవ్రంగా శ్రమించారు. సొంత పార్టీలోనే అవరోధాలు ఎదురైనా.. వాటన్నింటిని అధిగమించి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తొలి ఏడాది మొత్తం ఎన్నికలతోనే సమయం గడిచింది. తర్వాత రెండేళ్ల పాటు కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా అభివృద్ధి జరగలేదు. మిగతా రెండేళ్ల వ్యవధిలో నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో రూ.1,672కోట్ల నిధులను తీసుకువచ్చి ఔరా అనిపించారు. ఒకేసారి ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.135 కోట్లను నియోజకవర్గానికి మంజూరు చేయించారు. దీంతో తాండూరు మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు రూ1 కోటి చొప్పున రూ.36కోట్లతో అభివృద్ధి చేయించారు. నియోజకవర్గంలోని ప్రతి జీపీకి రూ.50 లక్షల చొప్పున నిధులు కేటాయించి, 147 గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించారు.

సభలు, సమావేశాలతో బిజీబిజీ అభివృద్ధే గెలిపిస్తుందంటూ రోహిత్‌రెడ్డి ధీమా గులాబీలో చేరి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నేత ఎమ్మెల్యేలకు ఎర కేసుతో జాతీయ స్థాయిలో పెరిగిన గ్రాఫ్‌

ఆత్మీయ పలకరింపు..

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించి, ఎమ్మెల్యేగా గెలిపించాలని రోహిత్‌రెడ్డి ఓటర్లకు ఫోన్‌ చేస్తున్నారు. ఒక్క ఓటుకోసమే కాకుండా.. వారి యో గక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. అక్కా ఇంటిస్థలం వచ్చిందా? చెల్లీ షాదీముబారక్‌, కల్యాణ లక్ష్మి చెక్కు, అయ్యా రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్‌ అందిందా అంటూ లబ్ధిదారులను పలకరిస్తున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన వద్దకు రావాలని సూచిస్తున్నారు.

పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దూకుడు పెంచారు. ఎమ్మెల్యేగా తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌పై పట్టు సాధించి, తనదైన శైలిలో రెండోసారి విజయం వైపు పరుగులు తీస్తున్నారు. నాయకులు ఎవరున్నా.. లేకున్నా.. చేసిన అభివృద్ధి పనులు, నమ్ముకున్న ప్రజలు అండగా ఉన్నారంటూ.. ప్రజా ఆశీర్వాద సభలతో జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతున్నారు.

మరిన్ని వార్తలు