నా కూతురు అమాయకురాలు.. జాగ్రత్తగా చూసుకోండి.. అల్లుడు గారు..

29 Mar, 2023 08:16 IST|Sakshi

విశాఖపట్నం: ‘మేము వెళ్లిపోతున్నాం.. అంతా జాగ్రత్తగా ఉండండి. తమ్ముడిని, నాన్నమ్మను జాగ్రత్తగా చూసుకోండి. అల్లుడు గారు.. నా కూతురు అమాయకురాలు.. జాగ్రత్తగా చూసుకోండి.. మీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండానే వెళ్లి పోతున్నాం. మమ్మల్ని క్షమించండి.. బైబై..’అంటూ ఓ దంపతుల సెల్ఫీ వీడియో సంచలనం సృష్టించింది. గాజువాకలోని వడ్లపూడి పరిధి తిరుమలనగర్‌లో కలకలం సృష్టించిన ఉక్కు ఉద్యోగి, అతని భార్య మిస్సింగ్‌ మిస్టరీ వీడలేదు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారి కుమార్తె, పోలీసులు తెలిపిన వివరాలివీ.. వడ్లపూడి తిరుమలనగర్‌లో ఉంటున్న చిత్రాడ వరప్రసాద్‌(47) స్టీల్‌ప్లాంట్‌లో మాస్టర్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తూ.. ప్రైవేట్‌గా శ్రీదుర్గా బ్యాటరీ కేర్‌ షాప్‌ను నడుపుతున్నారు.

భార్య మీరా(41), 19 ఏళ్ల కుమారుడు కృష్ణసాయితేజతో కలిసి వెంకటేశ్వర ప్యారడైజ్‌–2 అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. కుమార్తె దివ్యలక్ష్మికి గతేడాది కణితి గ్రామానికి చెందిన మరో ఉక్కు ఉద్యోగితో ఘనంగా వివాహం జరిపించారు. ఈ క్రమంలో వరప్రసాద్‌ తెలిసిన వాళ్లు, తోటి ఉద్యోగుల దగ్గర సుమారు రూ.60లక్షల వరకు అప్పులు చేశాడు. దీంతో అప్పులిచ్చిన వారంతా నిత్యం డబ్బులు చెల్లించాలని ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. అప్పుల బాధ భరించలేని వరప్రసాద్‌, అతని భార్య మీరా సోమవారం ఉదయం 11 గంటలకు కూతురు దివ్య లక్ష్మికి ఫోన్‌ చేసి తమ్ముడిని, నాన్నమ్మను జాగ్రత్తగా చూసుకోమని ఆవేదనతో మాట్లాడారు. కంగారుపడిన దివ్యలక్ష్మి తల్లిదండ్రుల వద్దకు వచ్చి ధైర్యం చెప్పింది.

మీరు ఏమీ చేసుకోవద్దు. అటువంటి ఆలోచనలు ఉంటే తమ్ముడు మీద ఒట్టు అని ఒట్టు వేయించుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తన అత్తవారింటికి వెళ్లిపోయింది. కొడుకు కృష్ణసాయి తేజ, నాన్నమ్మ షాప్‌ నుంచి 2 గంటలకు ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి మళ్లీ తిరిగి షాప్‌కు వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చిన కృష్ణసాయితేజకు అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ ఇంటి తాళాలు ఇచ్చాడు. అమ్మానాన్న ఎక్కడికి వెళ్లారని వాచ్‌మన్‌ను అడగ్గా.. తెలియదంటూ జవాబు ఇచ్చాడు. కంగారు పడిన కృష్ణసాయితేజ ఇంట్లోకి వెళ్లి చూడగా మంచంపై ఫ్యామిలీ ఫొటో, తల్లి మొబైల్‌లో సెల్ఫీ వీడియో ఉంది. వెంటనే తండ్రి వరప్రసాద్‌కు ఫోన్‌ చేశాడు. 5, 10 నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పిన తండ్రి.. ఎంత సేపైనా ఇంటికి రాలేదు.

మరలా ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో తెలిసిన వాళ్లకు ఫోన్‌ చేసి ఆరా తీశాడు. ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే దువ్వాడ పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. పోలీసుల వరప్రసాద్‌ ఫోన్‌ లొకేషన్‌ను ట్రాక్‌ చేశారు. లొకేషన్‌ ఆధారంగా అనకాపల్లి జిల్లా కొప్పాకలోని ఏలేరు కాలువ వద్ద వరప్రసాద్‌, అతని భార్య మీరాకు సంబంధించిన చెప్పులు, బ్యాగు, ఫోన్‌, బైక్‌ను గుర్తించారు. ఐదుగురు గజ ఈతగాళ్లను రప్పించి సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి మళ్లీ గాలింపు చర్యలు కొనసాగుతాయని అనకాపల్లి ఎస్‌ఐ సీహెచ్‌ నర్సింగరావు తెలిపారు. సాయితేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పరువు పోతుందనే భయంతోనేనా..?
చిత్రాడ వరప్రసాద్‌ ఉక్కు ఉద్యోగి. వరుస సంఘటనలు ఆయన్ని అప్పుల పాల్జేశాయి. వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడు. గతంలో భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకింది. గతేడాది కుమార్తె దివ్యలక్ష్మికి వివాహం చేశాడు. అప్పు చేసి కుమారుడితో ఓ బ్యాటరీ షాపు పెట్టించాడు. తోటి ఉద్యోగుల వద్ద ఎక్కవ వడ్డీకి అప్పులు చేయడం, అప్పు ఇచ్చినవారు నిత్యం ఇంటికి వచ్చి అప్పు తీర్చాలంటూ ఒత్తిడి చేయడంతో వరప్రసాద్‌ మానసికంగా కుంగిపోయాడు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం తెరమీదకు రావడం, అప్పుల ఇచ్చిన వాళ్లు అధిక ఒత్తిడి తీసుకురావడంతో.. వాటిని ఎలా తీర్చాలంటూ కుటుంబ సభ్యులకు చెప్పి నిత్యం ఆవేదన చెందేవారు. కాగా.. అప్పులు ఇచ్చిన వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నారా? వారు ఎక్కడైనా ఉన్నారా? మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు