11 కరోనా కేసుల నమోదు

20 Apr, 2023 10:16 IST|Sakshi

మహారాణిపేట: విశాఖలో రోజురోజుకూ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 251 మందికి పరీక్షలు నిర్వహించగా.. 11 మందికి కరోనా నిర్ధారణ అయింది. 10 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 33 మంది చికిత్స పొందుతున్నారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.జగదీశ్వరరావు తెలిపారు. 31 మంది హోం ఐసోలేషన్‌ ఉండగా, ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. మాధవధారలోని లవ్‌ అండ్‌ కేర్‌ సెంటర్‌లో అనాథ పిల్లలకు కోవిడ్‌ సోకడంతో భయాందోళన నెలకొంది.

ఇక్కడ ఆశ్రయం పొందుతున్న 21 ఏళ్ల మానసిక దివ్యాంగుడికి ఈ నెల 17న రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష నిర్వహించగా.. కోవిడ్‌ నిర్ధారణ అయింది. వెంటనే అతన్ని కేజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అప్పటికే ఈ యువకుడికి న్యూమెనియా, ఇతర వ్యాధులు ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. అదే సమయంలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మంగళవారం చనిపోయాడు.

అప్పటికి ఆర్‌టీపీసీఆర్‌ నివేదిక రాకపోవడంతో కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం కాన్వెంట్‌ జంక్షన్‌లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తరువాత వచ్చిన రిపోర్టులో నెగిజిట్‌ అని తేలిందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పి.అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆ యువకుడు కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. ఇదే ఆశ్రమానికి చెందిన ఓ బాలికకు పరీక్షలు నిర్వహించామని.. నెగిటివ్‌ వచ్చిందన్నారు. కానీ ఇతర వ్యాధుల కారణంగా బాలిక ఆరోగ్యం కూడా విషమంగా ఉందని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు