-

తెల్లారే వరకు..

28 Nov, 2023 00:58 IST|Sakshi
పూర్తిగా కాలిపోయిన జస్వంత్‌ షాపింగ్‌మాల్‌
ఎగసిపడ్డ మంటలు

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగాషాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం

సోమవారం ఉదయానికి

అదుపులోకి వచ్చిన మంటలు

రాత్రంతా శ్రమించిన

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు

జస్వంత్‌ రడీమేడ్స్‌కు రూ.5.60 కోట్లు,

ఎస్‌.కె.రడీమేడ్స్‌కు రూ.7లక్షల నష్టం

తగరపువలస: తగరపువలస ప్రధాన రహదారిలోని జస్వంత్‌ రడీమేడ్స్‌లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఎగిసిపడ్డ మంటలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి. భీమిలి సీఐ డి.రమేష్‌, తాళ్లవలస అగ్నిమాపకశాఖాధికారి శ్రీనివాసరాజు తమ సిబ్బందితో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం విశాఖకు చెందిన రెండు, విజయనగరం నుంచి రెండు, తాళ్లవలసకు చెందిన ఒక అగ్నిమాపక శకటాలను వినియోగించారు. రామన్నపేటకు చెందిన మాజీ సైనికుడు తమ్మిన నరసింగరావు రెండు ట్యాంకర్లు మంటలు ఆర్పడానికి సహాయపడ్డాయి. అగ్నిమాపక శకటాలకు ఆనందపురం మండలం పెద్దిపాలేనికి చెందిన చెన్నా కన్వెన్షన్‌ హాలు నుంచి వాటి యజమాని చెన్నా వెంకటేష్‌ నీటిని సరఫరా చేశారు. ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని డీఎఫ్‌వో రేణుకయ్య ధ్రువీకరించారు. కాగా.. ఈ ప్రమాదంలో జస్వంత్‌ రడీమేడ్స్‌కు రూ.5.60 కోట్లు, ఆ పక్కనే ఉన్న ఎస్‌.కె.రడీమేడ్స్‌కు రూ.7లక్షలు నష్టం వాటిల్లినట్లు వాటి యజమానులు కటకం సునీత, వెంపాడ సంతోష్‌ తెలిపారు.

దుకాణాలు ఖాళీ చేశారు

ఆదివారం అర్ధరాత్రి సమయంలో జస్వంత్‌ రడీమేడ్స్‌లో భారీగా మంటలు ఎగిసి పడటంతో చుట్టుపక్కల వ్యాపారులు ముందు జాగ్రత్తగా తమ దుకాణాల్లోని వస్తువులను ఖాళీ చేసేశారు. రాత్రి గ్యాస్‌ సిలిండర్లు పేలి మంటల తీవ్రత ఎక్కువ కావడంతో ఎస్‌.కె.రడీమేడ్స్‌ దుకాణం కాలిపోయింది. సిబ్బంది ప్రాణాలకు తెగించి షాపింగ్‌మాల్‌కు ఆనుకుని దుకాణాల గోడలకు కన్నాలు పెట్టి వేడి బయటకు వచ్చేలా చేశారు. సోమవారం ఉదయానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినా.. షాపింగ్‌మాల్‌ నుంచి వేడి పొగలు వస్తూనే ఉన్నాయి. అదృష్టవశాత్తూ షాపింగ్‌మాల్‌లో యజమానురాలు ఉంచిన నగదు, బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయి.

బాధితులకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి పరామర్శ

భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం బాధితులను పరామర్శించి వారికి ప్రభుత్వం, బీమా సంస్థల నుంచి నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తామన్నారు. అనంతరం డీఎఫ్‌వోతో మాట్లాడారు. ఇలాంటిఅగ్నిప్రమాదాల నుంచి రక్షణగా ప్రతీ వ్యాపారి అగ్నిమాపక నిరోధ పరికరాలు ఏర్పాటు చేసుకునేలా వర్తక సంఘం ప్రతినిధులకు చెబుతామన్నారు. ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్‌ అధ్యక్షుడు అక్కరమాని రామునాయుడు, వైఎస్సార్‌ సీపీ వార్డు అధ్యక్షుడు చిల్ల భాస్కరరెడ్డి, జగుపల్లి ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జీరు వెంకటరెడ్డి, కొప్పల రమేష్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు