-

పుష్కరిణీ నమోస్తుతే..

28 Nov, 2023 00:58 IST|Sakshi
వరాహ పుష్కరిణి వద్ద వేదికలపై నుంచి నక్షత్ర హారతి అందజేస్తున్న అర్చకులు

సింహాచలం: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం సాయంత్రం వరాహ పుష్కరిణికి జరిగిన పుణ్యనదీ హారతి(గంగా హారతి) కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎనిమిది మంది అర్చకులు ఒకే సారి వరాహ పుష్కరిణికి ఇచ్చిన హారతిని చూసి పరవశించారు. భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. భక్తులు పుష్కరిణి గట్టుపై పెద్ద ఎత్తున దీపారాధన చేశారు. కోలాటం, నృత్యాలు, సంకీర్తనలతో స్వామిని కొలిచారు. ముందుగా సింహాచలం దేవస్థానానికి చెందిన కొండ దిగువ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వెంకన్న ఉత్సవమూర్తులను సాయంత్రం 5 గంటలకు తిరువీధిగా వరాహ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వేదికపై ఉత్సవమూర్తులు, శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం ద్వయ హారతులు, నక్షత్ర హారతి, కుంభ హారతి స్వామికి సమర్పించారు. తర్వాత ఎనిమిది మంది అర్చకులు పుష్కరిణికి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఎనిమిది వేదికలపై నిలబడి.. వరాహ పుష్కరిణికి నక్షత్ర హారతులిచ్చారు. అనంతరం పుష్కరిణి గట్టుపై మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని దర్శించుకుని నదీ హారతిని తిలకించారు. ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ అధికారులు భక్తులకు ఇబ్బంది లేకుండా విశేష ఏర్పాట్లు చేశారు. స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్‌ అలంకారి కరి సీతారామాచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, సంపంగి శ్రీనివాసరావు, వారణాసి దినేష్‌రాజ్‌, సువ్వాడ శ్రీదేవి, ముదుండి రాజేశ్వరి, వంకాయల సాయి నిర్మల తదితరులు పాల్గొన్నారు.

పవిత్రమాసం.. కార్తీకం

మహిమాన్వితమైనది కార్తీక మాసం అని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. నదీ హారతి ఉత్సవంలో స్వామీజీ అనుగ్రహభాషణం చేశారు. మహా శివుడు, మహా విష్ణువులకు ఎంతో ఇష్టమైన మాసం కార్తీకమాసం అన్నారు. ఈ సారి సింహాచలం దేవస్థానం ఎంతో వైభవంగా నదీ హారతి కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తిని ఈ సందర్భంగా అభినందించారు.

వరాహ పుష్కరిణికి విశేషంగా పుణ్యనదీ హారతి

గతానికి భిన్నంగా ఎనిమిది మందిఅర్చకులతో నక్షత్ర హారతి

పరవశించిన భక్తజనం.. తిలకించిన శారదా పీఠాధిపతి

మరిన్ని వార్తలు