-

జీవీఎంసీకి 96 వినతులు

28 Nov, 2023 00:58 IST|Sakshi

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం డయల్‌ యువర్‌ మేయర్‌, జగనన్నకు చెబుదాం నిర్వహించారు. మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి పలువురు నుంచి వినతులు స్వీకరించారు. జోన్‌–2 పరిధి ఇందిరానగర్‌–1లో అక్రమ కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని పి.వరలక్ష్మి, జోన్‌–6 పరిధి వుడా ఫేజ్‌–2లో ట్రాఫిక్‌ ఐలాండ్‌లు మరమ్మతులు చేపట్టాలని కాకుల శివకుమార్‌, జోన్‌–8 పరిధి శ్రామిక్‌నగర్‌–3లో మంచినీటి సమస్యపై కొణతాల వెంకట అప్పారావు, జోన్‌–4 పరిధి చిలకపేటలో మురుగునీటి సమస్యపై వంకా మూర్తి, జోన్‌–5 పరిధి మాధవధారలో అక్రమ మంచినీటి కనెక్షన్లపై సనపల పుండరీకాక్షస్వామి మేయర్‌ ఫిర్యాదు చేశారు. 655 మంది క్లాప్‌ వాహన, ఈ–ఆటోల లోడర్లకు సంబంధించిన టెండర్లు ప్రభుత్వ, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయని జీవీఎంసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వీవీ వామనరావు అన్నారు. తక్షణమే ఈ టెండర్లను నిలుపుదల చేయాలని మేయర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా.. డయల్‌ యువర్‌ మేయర్‌కు 8 ఫిర్యాదులు, జగనన్నకు చెబుదాంకు 96 వినతులు అందాయి. నిర్ణీత సమయంలో అర్జీలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను మేయర్‌ ఆదేశించారు. అదనపు కమిషనర్లు డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజినీర్‌ రవికృష్ణరాజు, సీసీపీ సురేష్‌, సీఎంవోహెచ్‌ డాక్టర్‌ నరేష్‌కుమార్‌, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరావు, కార్యదర్శి పి.నల్లనయ్య, డీడీ(హర్టికల్చర్‌) దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు