-

పక్కాగా ఓటర్ల జాబితా

28 Nov, 2023 00:58 IST|Sakshi
● ఓటరు జాబితా ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ ● గత నెల 27 నుంచి ఇప్పటివరకు 1.99 లక్షల అభ్యంతరాలు ● డిసెంబర్‌ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ

8లో

సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు–2024 నిర్వహణకు సంబంధించి ఒక్కో ప్రక్రియ పూర్తవుతోంది. పాత ఓటర్ల జాబితా మదింపు తర్వాత విడుదల చేసిన ఓటరు జాబితా డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌పై జిల్లా ఎన్నికల యంత్రాంగం అభ్యంతరాలు స్వీకరిస్తోంది. 43 రోజుల పాటు అంటే డిసెంబర్‌ 9 వ తేదీ వరకు ముసాయిదాపై ఓటర్ల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించనున్నారు. ప్రతీ నియోజకవర్గం నుంచి భారీగానే అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మల్లికార్జున ఆదేశాలతో వాటన్నింటినీ క్షేత్ర స్థాయిలో పరిశీలించి..పరిష్కరిస్తున్నారు. వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని బీఎల్‌వోలు ఓటరు వద్దకు వెళ్లి వివరాలు సేకరించి.. వారు సంతృప్తి చెందిన అనంతరం క్లియర్‌ చేస్తున్నారు. ఓటర్ల నుంచి వచ్చిన క్లెయిమ్స్‌ను అనుసరించి.. అవసరమైన ఫాంను నింపి.. దాని ప్రకారం సదరు ఓటరుకు సంబంధించిన మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే అధికారులు సవరిస్తున్నారు. డిసెంబర్‌ 9వ తేదీ వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు.

డిసెంబర్‌ 2, 3 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు

ఈ సారి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల యంత్రాంగం శ్రమిస్తోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ నెలలో రెండు రోజుల పాటు బూత్‌ స్థాయిలో క్యాంపులు ఏర్పాటు చేయగా విశేష స్పందన లభించింది. ఇదే స్ఫూర్తితో చివరిసారిగా డిసెంబర్‌ 2, 3 తేదీల్లో బూత్‌ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించే బాధ్యతను బీఎల్‌వోలకు అప్పగించారు. ఈఆర్వోలు పర్యవేక్షించనున్నారు. డోర్‌ టూ డోర్‌ సర్వే సమయంలో వచ్చిన అభ్యంతరాల్లో పరిష్కరించాల్సినవి 80 వేలు ఉండగా.. గత నెల 27న ముసాయిదా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు మరో 1.12 లక్షలు వచ్చాయి. వీటిలో ఈ నెల 24 వరకు 1.23 లక్షల దరఖాస్తులను పరిష్కరించారు.

ఆ ఓట్లపై ప్రధాన దృష్టి

2019 ఎన్నికల సమయంలో కేవలం 72 రోజుల్లోనే లక్షల ఓట్లను అప్పటి తెలుగుదేశం నేతలు అడ్డగోలుగా చేర్పించేశారు. దీంతో ఓటర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. డోర్‌ టూ డోర్‌ సర్వేతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇలాంటి ఓట్లని తొలగిస్తున్నారు. ఒకే ఇంటి డోర్‌ నంబర్‌తో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వాటిని గుర్తించారు. ఇలాంటి పాయింట్లు 2019 ఓటర్ల జాబితాలో ఏకంగా 1.90 లక్షలు ఉన్నాయి. వీటన్నింటినీ అధికారులు స్క్రూట్నీ చేశారు. ఇలాంటి ఇళ్లు ప్రస్తుతం కేవలం 15 వేలు మాత్రమే ఉన్నాయి. అదే విధంగా.. కొందరు ఓటర్లకు సంబంధించిన కార్డులు, జాబితాలో పొందుపరిచిన చిరునామాలో డోర్‌ నంబర్‌ లేనివి కూడా గుర్తించారు. ఇలా డబులింగ్‌ ఓట్లు, చిరునామాలో లేకపోయినా ఉన్నట్లుగా చూపించిన ఓట్లన్నింటినీ అధికారులు తొలగించారు. మరోవైపు 2024 జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ, తనిఖీ ప్రక్రియ జరుగుతోంది. జనవరి 5న ఎన్నికల కమిషన్‌ తుది జాబితాని ప్రకటిస్తుంది. ఈ జాబితా ప్రకారమే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రతీ ఒక్క ఓటును నిశితంగా పరిశీలించి చర్యలు చేపడుతున్నారు. తప్పులు లేని జాబితా తయారు చేసేందుకు సమన్వయంతో పని చేస్తున్నారు.

శతశాతం దరఖాస్తులు పరిష్కరిస్తాం

డిసెంబర్‌ 9 లోపు వచ్చే ప్రతీ దరఖాస్తుని పరిగణనలోకి తీసుకుంటాం.డిసెంబర్‌ 26 వరకు అభ్యంతరాల పరిష్కారానికి సమయం ఉండటంతో శతశాతం క్లియర్‌ చేస్తాం. ఫారం–6, 7, 8 పెండింగ్‌ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాం. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా వేగవంతం చేశాం. భార్యాభర్తలకు ఒకే పోలింగ్‌ బూత్‌లో ఓటు లేకపోతే.. వారి ఊరిలోనే ఫారం–8 దరఖాస్తు చేస్తే వేరే పోలింగ్‌ బూత్‌లో ఉన్న ఓటును తొలగిస్తాం. డిసెంబర్‌ 2,3 తేదీల్లో బూత్‌ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.

– కె.మోహన్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి

గత నెల 27 నుంచి ఈ నెల 24 వరకు నియోజకవర్గాల వారీగా వచ్చిన అభ్యంతరాలు, పరిష్కరించిన వివరాలను పరిశీలిస్తే..

నియోజకవర్గం ఫారం–6 పరిష్కారం బ్యాలెన్స్‌ ఫారం–7 పరిష్కారం బ్యాలెన్స్‌ ఫారం–8 బ్యాలెన్స్‌ పరిష్కారం

భీమిలి 3313 2000 1313 4598 2460 2138 9953 6490 3463

విశాఖ తూర్పు 6221 993 5228 4084 555 3529 15874 9098 6776

విశాఖ దక్షిణం 1859 597 1262 3129 865 2264 7034 4425 2609

విశాఖ ఉత్తరం 2995 873 2122 2679 02 2677 9727 4215 5512

విశాఖ పశ్చిమం 1900 811 1089 4918 1423 3495 7156 4190 2966

గాజువాక 3774 1336 2438 3373 646 2727 8513 5892 2621

పెందుర్తి 2849 681 2168 3677 1038 2639 4972 3398 1574

మొత్తం 22911 7291 15620 26458 6989 19469 63229 37708 25521

మరిన్ని వార్తలు