-

నేటి నుంచి సమ్మెటివ్‌ పరీక్షలు

28 Nov, 2023 00:58 IST|Sakshi
భీమిలి ఎమ్మార్సీలో ప్రశ్నా పత్రాలను సిద్ధం చేస్తున్న ఉపాధ్యాయులు
ఏర్పాట్ల పూర్తి: డీఈవో చంద్రకళ

విశాఖ విద్య: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో సమ్మెటివ్‌ –1 పరీక్షలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ(ఎస్‌సీఈఆర్టీ ) నుంచి జారీ అయిన షెడ్యూల్‌ అనుగుణంగా డిసెంబర్‌ 8 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఒకటి నుంచి 6వ తరగతి వరకు అదే విధంగా 8,10వ తగరతి విద్యార్థులకు రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. 7,9వ తరగతి విద్యార్థులకు రోజూ మధ్యాహ్నం 1.30గంటల నుంచి 4.45 వరకు పరీక్ష ఉంటుంది. ఇందుకోసమని జిల్లా విద్యాశాఖాధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని 1,389 పాఠశాలలకు చెందిన 3,91,736 మంది విద్యార్థులు సమ్మెటివ్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసేలా నిర్వహిస్తున్న పరీక్షలు కావటంతో డీఈవో ఎల్‌. చంద్రకళ తమ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను రాంజీ హైస్కూల్‌లోని స్టాక్‌ పాయింట్‌ నుంచి జిల్లాలోని అన్ని ఎమ్మార్సీలకు సరఫరా చేశారు. ఆయా మండలాల విద్యాశాఖాధికారుల సమక్షంలో ఎమ్మార్సీ సిబ్బంది వీటిని పాఠశాలల వారీగా బండిల్స్‌ను సిద్ధం చేశారు. డిసెంబర్‌ 9న అన్ని పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి, ఆ రోజు జవాబు పత్రాలను అందజేసి, వీటిపై సమీక్ష చేయనున్నారు. సమ్మెటివ్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని డీఈవో ఎల్‌. చంద్రకళ తెలిపారు.

మరిన్ని వార్తలు