పథకాల అమలులో అలసత్వం వద్దు

29 Nov, 2023 01:22 IST|Sakshi
● గైర్హాజరైన అధికారులపై చర్యలు తప్పవు ● దిశ అధ్యక్షురాలు, అరకు ఎంపీ మాధవి

మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో పక్కాగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, ఇందులో ఎటువంటి అలసత్వం చూపొద్దని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) అధ్యక్షురాలు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి స్పష్టం చేశారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్‌ ఎ.మల్లికార్జునతో కలిసి ఆమె శాఖల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటువంటి సమీక్ష సమావేశాలకు జిల్లా అధికారులంతా తప్పకుండా హాజరు కావాలన్నారు. ప్రతీ మూడు నెలలకు ఓసారి సమీక్ష నిర్వహిస్తామని, వచ్చే సమావేశానికి అధికారులందరూ పూర్తి సమాచారంతో హాజరు కావాలని స్పష్టం చేశారు. తొలుత అటవీ, దివ్యాంగుల సంక్షేమం, నీటి పారుదల, ఐసీడీఎస్‌, జీవీఎంసీ, సమగ్ర శిక్ష, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, పౌర సరఫరాలు, డీఆర్‌డీఏ, డ్వామా, ఏపీఈపీడీసీఎల్‌ తదితర శాఖలపై సమీక్షించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా శాఖల్లో పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసి.. లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ రిఫరల్‌ ఆస్పత్రుల వివరాలు అందరికీ తెలియజేయాలన్నారు. కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటికి అనుబంధంగా కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జరిగిందన్నారు. దిశ అధ్యక్షురాలి ఆదేశాలు, సూచనలు తప్పక పాటించాలని, వచ్చే సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరు కావాలని అధికారులకు స్పష్టం చేశారు. సమీక్షలో జెడ్పీ సీఈవో ఎం.పోలినాయుడు, డ్వామా పీడీ ఇ.సందీప్‌, జిల్లా అటవీ శాఖాధికారి అనంత్‌ శంకర్‌, గనుల శాఖ ఉప సంచాలకుడు రాజు, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త బి.శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ రవీంద్ర, వ్యవసాయం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

డుమ్మా కొట్టిన అధికారులపై ఆగ్రహం

సమీక్షకు జాతీయ రహదారులు, బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే అధికారులెవరూ హాజరు కాలేదు. పర్యాటక శాఖ జిల్లా అధికారి రాలేదు. పలు శాఖల అధికారులు హాజరు కాకుండా కింది స్థాయి అధికారులు హాజరవ్వడంతో ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. డుమ్మా కొట్టిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతి పొంది, బాధ్యత గల అధికారులను సమీక్షకు పంపాలని సూచించారు.

మరిన్ని వార్తలు