జూ యానిమల్‌ కీపర్ల నిరసన

29 Nov, 2023 01:22 IST|Sakshi

ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కులో అవుట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న యానిమల్‌ కీపర్లు మంగళవారం నిరసనకు దిగారు. జూలో ఎలుగుబంటి దాడి చేయడంతో సోమవారం యానిమల్‌ కీపర్‌ నగేష్‌బాబు(23) మృతి చెందిన విషయం తెలిసిందే. అధికారుల నిర్లక్ష్య ధోరణితోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ జూ ప్రధాన ద్వారం వద్ద వీరంతా ఆందోళన చేశారు. యానిమల్‌ కీపర్లు రోజూ ఉదయం 8 గంటలకు జూకు చేరుకుని.. వన్యప్రాణులకు నైట్‌క్రాల్‌లోనే ఆహారం వేస్తారు. 9 గంటలకు సందర్శకుల కోసం డే క్రాల్‌లోకి విడిచిపెడతారు. మంగళవారం ఎప్పటిలాగే ఉదయం 8 గంటలకు జూకి చేరుకున్న యానిమల్‌ కీపర్లు.. ప్రధాన గేటు వద్దే ఆగిపోయారు. తమకు రక్షణ కల్పించాలని, నగేష్‌ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న క్యూరేటర్‌ నందనీ సలారియా వెంటనే జూకు చేరుకుని వారితో మాట్లాడారు. మీ డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించి.. 9.20 గంటలకు విధుల్లో చేరారు. నిరసన వల్ల వన్య ప్రాణులకు ఆహారం అందించడంలో గంటకు పైగా ఆలస్యమైంది. కాగా.. ఆరిలోవ పోలీసులు జూ పార్కును సందర్శించి.. నగేష్‌ మృతి పట్ల విచారణ చేపట్టారు. యానిమల్‌ కీపర్ల నుంచి వివరాలు సేకరించారు.

మరిన్ని వార్తలు