కచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించాలి

29 Nov, 2023 01:24 IST|Sakshi
జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడు జె.శ్యామలరావు, కలెక్టర్‌ మల్లికార్జున
● చిన్నపాటి తప్పు కూడా దొర్లడానికి వీలులేదు ● జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడు జె.శ్యామలరావు ● స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌–2024 సమీక్ష

మహారాణిపేట: చిన్నపాటి తప్పు లేకుండా కచ్చితమైన వివరాలతో కూడిన ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, విశాఖ జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడు జె.శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌–2024లో భాగంగా ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జునతో కలిసి ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రక్రియలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో విశాఖ జిల్లాకు ప్రత్యేకత ఉందని, అందరి దృష్టి దీనిపైనే ఉంటుందని తెలిపారు. డిసెంబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉన్నతాధికారులు రానున్నారని, అప్పటికి అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్‌ పరిశీలిస్తుందని అందరూ జాగ్రత్త వహించాలని చెప్పారు. చేస్తున్న ప్రతి పనికీ రికార్డు మెయింటైన్‌ చేయాలన్నారు. డూప్లికేట్‌ ఓట్ల తొలగింపులో పారదర్శక విధానాలు పాటించాలని, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే ఫిర్యాదులకు సకాలంలో పరిష్కారం చూపాలని ఆదేశించారు. పెండింగ్‌ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. జాబితా రూపకల్పనలో తప్పులు జరిగితే ఈఆర్వోలే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక క్యాంపులు పెట్టి మరింత మంది యువ ఓటర్లకు అవకాశం కల్పించాలని సూచించారు.

ప్రత్యేక క్యాంపుల ద్వారా ఓటర్ల చైతన్యం

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలో అమలు చేసిన విధానాలు, సాధించిన ఫలితాల గురించి కలెక్టర్‌ మల్లికార్జున వివరించారు. యువ ఓటర్ల చేరిక, డెత్‌ ఓటర్ల తొలగింపు తదితర అంశాలను ప్రస్తావించారు. ఇప్పటివరకు ఐదు లక్షలకుపైగా క్లెయిమ్స్‌ను పరిష్కరించామని పేర్కొన్నారు. జిల్లాలోని ఓటర్ల జాబితా వివరాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రతి నెలా మొదటి శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి ఓటర్లను చైతన్య పరుస్తున్నామని, కొత్త ఓటర్లను చేరుస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో డీఆర్వో కె.మోహన్‌ కుమార్‌, ఆర్డీవోలు హుస్సేన్‌ సాహెబ్‌, భాస్కరరెడ్డి, ఈఆర్వోలు లక్ష్మారెడ్డి, అఖిల, రామ్మోహన్‌ రావు, ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ పాల్‌ కిరణ్‌, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు