కోచ్‌ను కలిసిన అంతర్జాతీయ క్రీడాకారిణి

25 Sep, 2023 01:04 IST|Sakshi
చిరు ప్రసంగాలు చేసిన చిన్నారులను సత్కరిస్తున్న సంస్థ ప్రతినిధులు

శృంగవరపుకోట: ఈ నెల 19,20 తేదీల్లో శ్రీలంకలో జరిగిన ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 400 మీటర్ల పరుగుపందెంలో సిల్వర్‌ మెడల్‌ సాధించిన సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన కనకల పైడిరాజు భర్తతో వచ్చి తన కోచ్‌ పొట్నూరు శ్రీరాములును ఆదివారం కలిసింది. ఈ సందర్భంగా ఆమె కోచ్‌ శ్రీరాములుతో మాట్లాడుతూ తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం మీరేనని, మీ ప్రోత్సాహంతోనే జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించానని చెబుతూ సంతోషం వెలిబుచ్చింది. ఈ సందర్భంగా భర్తతో కలిసి కోచ్‌ దగ్గర ఆశీస్సులు తీసుకుంది.

ఆకట్టుకున్న ‘వందే గురజాడ కోకిలమ్‌’

విజయనగరం టౌన్‌: విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక గురజాడ కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన వందే గురజాడ కోకిలమ్‌ సాహితీ సదస్సు ఆద్యంతం ఆహూతులను అలరించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక ప్రతినిధి డాక్టర్‌ ఎంవీఆర్‌. కృష్ణాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గురజాడ రచనలపై గురజాడ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థినులు చిరు ప్రసంగాలను ఇచ్చారు. కన్యాశుల్కంపై ఎస్‌.హన్సిక, ముత్యాల సరాలును డి.నాగమణి, కథానికను కె.లక్ష్మీశ్రీవాణిలు ఇచ్చిన అద్భుతమైన ప్రసంగాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థినులను సంస్థ నిర్వాహకులు సత్కరించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు ఈపు విజయకుమార్‌ సదస్సుకు సభాధ్యక్షత వహించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎ.గోపాలరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో సభ్యులు భోగరాజు బాబూజీ, కాపుగంటి ప్రకాశ్‌, దామరాజు శంకరం, డాక్టర్‌ జక్కు రామకృష్ణ, భోగరాజు సూర్యలక్ష్మి, సుబ్రహ్మణ్యం, హరిచందన్‌, శిరీష తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు