మన్యం గజగజ

18 Nov, 2023 00:34 IST|Sakshi
మన్యంలో కురుస్తున్న పొగ మంచు

ఆహార జాగ్రత్తలు ఇలా..

● జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. శుభ్రమైన ఆహారంతో పాటు వేడి ఆహారం తీసుకోవాలి.

● రోగనిరోధక శక్తి పెంచే విటమిన్‌–సి సమృద్ధిగా ఉండే ఆహారం తినాలి. జింక్‌ ఉండే బాదం వంటి వాటిని, ఇన్‌ఫెక్షన్లతో పోరాడే ఫ్రో బయోటెక్‌ ఎక్కువగా ఉన్న పదార్ధాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

● సీజన్‌లో దొరికే అన్ని పండ్లు తీసుకోవచ్చు. జామ, దానిమ్మ, బొప్పాయి, అరటిపండ్లు తీసుకోవచ్చు. వీటిలో విటమిన్‌–సి ఎక్కువగా ఉండి జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

● నల్ల ద్రాక్ష తీసుకుంటే చర్మ సంరక్షణకు దోహదపడుతుంది. వీటిలో యాంటీ యాక్సిడెంట్స్‌ శరీరానికి మేలు చేస్తాయి.

సీతంపేట: మన్యంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. మన్యంలో చలి తీవ్రత పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో మంచుకురుస్తోంది.

ఈ కాలంలో వ్యాధులు వ్యాప్తిచెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల ప్రభావం నుంచి గట్టెక్కవచ్చంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంతవరకు చలిలో రాకపోకలు చేయరాదని, థైరాయిడ్‌ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచులో తిరగకుండా ఉండాలి. ఒక వేల బయటకు వెళ్లాల్సి వస్తే తల, శరీరం కప్పి ఉండేలా ఉన్ని దుస్తులు ధరించాలి. ప్రతిఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే శ్వాసకోస వ్యాధులు వచ్చే ప్రమాదముంది. కూల్‌ డ్రింకులు, ఐస్‌క్రీమ్‌లు వంటివి పూర్తిగా తీసుకోవద్దు.

– బొడ్డేపల్లి శివకుమార్‌, ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌, సీతంపేట ఏరియా ఆస్పత్రి

● ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయాలి.

● తెల్లవారు జామున 5 నుంచి 6 గంటల మధ్య జాగింగ్‌ చేయకపోవడం మంచిది. కాస్తా ఎండ వచ్చిన తర్వాత వ్యాయామం చేస్తే మంచు నుంచి రక్షణ పొందవచ్చు.

● తలకు స్కార్ప్‌, మంకీ టోపీ వంటివి ధరించి చెవుల్లో దూదిపెట్టుకోవాలి.

● వాకింగ్‌ చేసేవారు బూట్లు, సాక్సులు, బైక్‌లు నడిపేవారు గ్లౌవ్స్‌ ధరించాలి. శరీరం మొత్తం కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి.

● వృద్ధులు, పిల్లలు, చల్లని వాతావరణంలో తిరగకూడదు. మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు మందులు విధిగా వాడాలి. దగ్గు, జలుబు మూడు రోజులకు మించి తగ్గకుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

● చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. సొరియాసిస్‌ సమస్యతో బాధపడేవారికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. మందులు క్రమం తప్పకుండా వాడాలి.

● గ్లిజరిన్‌ సబ్బులు వాడడం మంచిది.

● కొబ్బరినూనె, ఆలివ్‌ఆయిల్‌, వెన్న ఒంటికి రాసుకుని ఆ తర్వాత స్నానం చేయడం మంచిది. అలా చేయడం వల్ల చర్మంతో తేమ నిల్వ ఉంటుంది.

● సబ్బులు బదులు సున్నిపిండి, పెసరపిండి వాడితే శరీరం పొడిబారకుండా ఉంటుంది.

● దాహం వేయకపోయినా సమృద్ధిగా నీరు తాగాలి.

● గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో రెండు చెంచాల నూనెను వేసి చేస్తే ప్రయోజనం ఉంటుంది. తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి. చలికాలంలో తలకు రంగు వేయడం వలన కురులు మాయిశ్చర్‌ కోల్పోయి పొడిగా మారే ప్రమాదముంది.

● చేతులు, పాదాలు పగిలితే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పువేసిన పాత్రలో ఉంచి తరువాత పొడి బట్టతో తుడుచుకోవాలి.

జాగ్రత్తలు పాటిద్దాం...

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

పెరిగిన చలితీవ్రత

సీజనల్‌ వ్యాదులతో తస్మాత్‌ జాగ్రత్త అంటున్న వైద్యులు

మరిన్ని వార్తలు