ఓట్ల కోసం దిగజారుడు వ్యాఖ్యలా?

18 Nov, 2023 00:34 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజాస్వామ్య విధానంలో రాజ్యాంగబద్ధంగా 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఖండించారు. ఇన్నాళ్లూ బంగ్లాకే పరిమితమైన ఆయన ఎన్నికలొస్తున్నప్పుడు బయటకొచ్చి కేవలం ఓట్ల కోసం దిగజారుడు మాటలు వల్లెవేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. కలెక్టరేట్‌ వద్ద జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినవెంకట అప్పలనాయుడు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ వెంకటేశ్వరరావు, ఏపీ టూరిజం బోర్డు డైరెక్టరు రేగాన శ్రీనివాసరావులతో కలిసి మీడియా సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసిన చంద్రబాబును గజదొంగ అనక తప్పదన్నా రు. అతన్ని సమర్ధిస్తున్న టీడీపీ నాయకులూ దొంగలేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను అశోక్‌ వెనక్కి తీసుకోకపోతే దూషణలు తప్పవన్నారు.

అశోక్‌ చేసిందేమీ లేదు...

సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్‌ విజయనగరం ప్రజలకు చేసిందేమీ లేదని జెడ్పీ చైర్మన్‌ ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో చేసిందేమిటో చెప్పుకోవడానికి ఏమీ లేక, గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో, మంత్రి బొత్స సత్యనారాయణ తదితర నాయకుల కృషితో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక అశోక్‌ మతిభ్రమించినవాడిలా దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. స్వయంగా కేంద్ర విమానయాన మంత్రిగా ఉన్నా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి నిధు లు తేలేదని గుర్తు చేశారు. అన్నివిధాలా మోసం చేయబట్టే ప్రజలు ఓడించి బంగ్లాకు పంపించారని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో, కేంద్ర మంత్రిత్వశాఖలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేకసార్లు సంప్రదించి భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు సాధించారని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయని, త్వరలోనే మీడియాను తీసుకెళ్లి చూపిస్తున్నామని వెల్లడించారు.

జగనన్నదే ఆ ఘనత...

ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కింద కేంద్ర ప్రభు త్వం దేశవ్యాప్తంగా ఒక కోటీ 28 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే అందులో సుమారు 30 లక్షల ఇళ్లను మన రాష్ట్రానికి సాధించిన ఘనత జగనన్నకే దక్కుతుందని జెడ్పీ చైర్మన్‌ చెప్పారు. రాష్ట్రంలోని పేదలకు సుమారు రూ.15 వేల కోట్లతో స్థలాలు కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వడమే గాక జగనన్న కాలనీల్లో మౌలిక వసతులన్నీ కల్పించిందని వివరించారు. ఆరోజు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో భాగస్వాములై ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించీ అశోక్‌ సహా టీడీపీ నాయకులెవ్వరూ ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ చేపట్టలేదని విమర్శించారు.

స్వప్రయోజనాలే టీడీపీకి ముఖ్యం...

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం జిల్లాకు దక్కిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేవలం రియల్‌ ఎస్టేట్‌, స్వప్రయోజనాల కోసమే మైదాన ప్రాంతమైన కొత్తవలసలో పెట్టాలని చూశారని, అయినా శంకుస్థాపన కూడా చేయలేకపోయారని మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక గిరిజన ప్రాంతమైన సాలూరు నియోజకవర్గం పరిధిలో భూసేకరణ చేసి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తీసుకొచ్చి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేయించారని గుర్తు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసుకొని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయని వెల్లడించారు.

మెడికల్‌ కాలేజీ వద్దన్నారే...

మాన్సాస్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఆనంద గజపతిరాజు ముందుకొచ్చారని, ఆయన కీర్తిశేషులైన తర్వాత మాన్సాస్‌ చైర్మన్‌ పదవిలోకి వచ్చిన అశోక్‌ తమకు మెడికల్‌ కాలేజీ అక్కర్లేదంటూ స్వదస్తూరీతో తిరస్కరించిన విషయాన్ని మరచిపోలేమని జెడ్పీ చైర్మన్‌ అన్నారు. నీతిమంతులమంటూ ఓట్లు అడుగుతున్న అశోక్‌పైనా అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం జగద్వితమేనన్నారు.

అభివృద్ధిని ఓర్వలేని అశోక్‌...

శాసనసభ డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో విజయనగరంలో, మంత్రి బొత్స సత్యనారాయణ తదితర నేతల కృషితో జిల్లాలో గతంలో ఎన్నడూలేనంతగా జరుగుతున్న అభివృద్ధిని చూసి అశోక్‌ ఓర్వలేకపోతున్నారని జెడ్పీ చైర్మన్‌ ఎద్దేవా చేశారు. ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఢిల్లీలో తిష్టవేయడం, సొంత మనుషుల పనులు చక్కబెట్టుకోవడమేనని విమర్శించారు. విజయనగరం ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎన్‌టీ రామారావు హయాంలో ప్రతిపాదించిన తారకరామతీర్థ సాగర్‌ ప్రాజెక్టును వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని గుర్తు చేశారు. కానీ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కనబెట్టిందని విమర్శించారు. ఇన్నాళ్లకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే ఆ ప్రాజెక్టును పూర్తిచేయడానికి నడుంబిగించారని చెప్పారు.

మళ్లీ ప్రజలు మోసపోరు...

ఏం చేశారని టీడీపీ నాయకులపై తమకు కక్ష ఉంటుందని మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచుకొని చంద్రబాబు జైలుకెళ్లారని, ఆయన్ను సీఐడీ అరెస్టు చేసిందని, కోర్టు విచారిస్తుందని చెప్పారు. సానుభూతి ముసుగులో ఓట్ల కోసం మళ్లీ మాయమాటలు చెబితే ప్రజలు నమ్మరని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని అన్నారు.

మతిభ్రమించిన వ్యక్తిలా అశోక్‌ గజపతి అసంబద్ధ వ్యాఖ్యలు

మళ్లీ టీడీపీ నేతల మాయమాటలతో ప్రజలు మోసపోరు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

మరిన్ని వార్తలు