భద్రతా చర్యలే ప్రధానం

3 Dec, 2023 01:06 IST|Sakshi

రసాయనక

పరిశ్రమల్లో..

విజయనగరం అర్బన్‌: జిల్లాలో ప్రమాదకర రసాయనాలను నిల్వచేసే పరిశ్రమల్లో విపత్తులు సంభవించకుండా ఆయా పరిశ్రమలు తగిన భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి విపత్తుల నిర్వహణ కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదేశించారు. దీనికి సంబంధించిన నివేదికలను నెలరోజుల్లో అందజేయాలని ఆదేశించారు. ప్రమాదకర రసాయనాలు నిల్వచేసే పరిశ్రమల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు ఏర్పాటైన జిల్లా (క్రైసిస్‌ గ్రూప్‌) విపత్తుల నిర్వహణ కమిటీ తొలి సమావేశం కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అధ్యక్షతన కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం జరిగింది. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యలు, ప్రమాదాలు జరిగిన వెంటనే వివిధ ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు తీసుకోవాల్సిన సహాయక చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రమాదకర రసాయనాలను ట్యాంకర్ల ద్వారా రవాణా చేసేసమయంలో భద్రత నియమాలు పాటించేలా రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రసాయనాలు తీసుకువెళ్లే ట్యాంకర్లు మార్గంమధ్యలో తోచిన ప్రదేశంలో నిలిపివేయకుండా వాటిని నిలిపిన ప్రదేశం, ఆయా రసాయనాలకు సంబంధించిన సమాచారం సమీపంలోని పోలీస్‌, ఫైర్‌ తదితర శాఖల అధికారులకు తెలియజేసేలా స్పష్టమైన నిబంధనలు రూపొందించాలన్నారు. ఆయా వాహనాలకు ప్రమాదం జరిగితే సమీప ప్రాంతానికి చెందిన వారికి సమస్యలు లేకుండా చూసేందుకు హెచ్చరిక వ్యవస్థలు ఏర్పా టు చేయాలన్నారు. రసాయనిక పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగే సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలు, ఆయా పరిశ్రమలు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై అవగాహన, సన్నద్ధత కోసం ఈ నెల 21న మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మైలాన్‌ పరిశ్రమలో భద్రతా ఏర్పాట్లను డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ నారాయణ తెలిపారు. విశాఖలోని సివిల్‌ డిఫెన్స్‌ విభాగం ద్వారా ప్రజలకు ఈ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సివిల్‌ డిఫెన్స్‌ డిప్యూటీ కలెక్టర్‌ పద్మలత చెప్పారు. జిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ వలంటీర్లకు ప్రథమ చికిత్స అందించడంలో శిక్షణ ఇచ్చి అత్యవసర సమయాల్లో సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఫ్యాక్టరీల్లో రసాయనాలతో పార్క్‌చేసిన ట్యాంకర్లను వెంటనే తరలించేందుకు వీలుగా అత్యవసర గేటును అదనంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ చెప్పారు.

జిల్లాలో అత్యంత ప్రమాదకర రసాయనాలు నిల్వచేసే పరిశ్రమలు లేవని, ప్రమాదకర రసాయనాలు నిల్వచేసే ఫ్యాక్టరీలు పది వరకు ఉన్నట్టు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జీవీవీఎస్‌ నారాయణ చెప్పారు. భద్రతా చర్యలపై తనిఖీలు చేస్తామన్నారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రాంబాబు, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ రాంప్రకాష్‌, విశాఖలోని జాయింట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జె.శివశంకర్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, రవాణాశాఖ అధికారి రమేష్‌, ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ డీపీఎం రాజేశ్వరి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భాస్కరరావు, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ ప్రసాదరావు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

పరిశ్రమల్లో భద్రతా చర్యలపై నెల

రోజుల్లోగా నివేదికలు అందజేయాలి

రసాయనక విపత్తుల నిర్వహణ కమిటీలో కలెక్టర్‌ ఆదేశం

మరిన్ని వార్తలు