424 కిలోల గంజాయి స్వాధీనం

3 Dec, 2023 01:08 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న గంజాయితో ఎస్‌.కోట ఎస్‌ఈబీ సిబ్బంది

వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు

శృంగవరపుకోట: ఎస్‌ఈబీ అధికారులు పక్కా సమాచారంతో దాడిచేసి రూ.50లక్షలు విలువచేసే 424 కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌.కోట ఎస్‌ఈబీ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఎస్‌.వెంకటరావు గంజాయి కేసు వివరాలు వెల్లడించారు. కమిషనర్‌ ఎం.రవిప్రకాశ్‌, డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి, ఎస్పీ మహేశ్వరరాజుకు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఎస్‌.కోట వైపు భారీగా గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో సిబ్బందిని అప్రమత్తం చేశాం. శుక్రవారం రాత్రి రెండు వాహనాలతో డీటీఎ్‌ఫ్‌, ఎస్‌.కోట ఎస్‌ఈబీ, సిబ్బందితో గస్తీ కాశాం. బొడ్డవర చెక్‌ పోస్టులో పోలీసులు వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసినా, డ్రైవర్‌ అతివేగంగా గంజాయి ఉన్న బొలేరో వాహ నాన్ని తాటిపూడి రోడ్డులోకి మళ్లించాడు. రెండు వాహనాల్లో ఎస్‌ఈబీ, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది బొలేరో వాహనాన్ని వెంబడించారు. అతివేగంతో వెల్తున్న బొలేరో నవోదయ స్కూల్‌ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌ను , బొలేరో వాహనంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ కొర్రా రమేష్‌ గంజాయిని వేపాడ మండలంలోని బొద్దాం గ్రామానికి తరలిస్తున్నట్టు చెప్పాడని, దీనిపై పూర్తిస్థాయి విచారణకు టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా ఎస్సీ ఆదేశాలతో ఎస్‌.కోట పోలీసులు సహకారం అందించారన్నారు.

మరిన్ని వార్తలు