● ఆర్బీకేల ద్వారా పశుపోషణ ● 75 శాతం రాయితీపై గడ్డి విత్తనాలు అందజేత ● జిల్లాలో 60.02 టన్నుల విత్తనాల పంపిణీ లక్ష్యం

4 Dec, 2023 00:34 IST|Sakshi
పాడిపరిశ్రమకు అండదండలు

చీపురుపల్లి: ఒకప్పుడు రైతులు వ్యవసాయం, పాడి పరిశ్రమను రెండు కళ్లుగా చూసుకునే వారు. అంతేకాకుండా పాడి పశువులు ఉన్న ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి ఉంటుందనే నమ్మకం ఉండేది. తరువాత కాలంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకం అందించకపోవడం, పాడి పరిశ్రమ అభివృద్ధి చేసినా మార్కెటింగ్‌ సదుపాయాలు లేకపోవడంతో పూర్తిగా పాడిసంపద దూరమైంది. దీని కారణంగా పల్లెల్లో సైతం పాల ప్యాకెట్లు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పూర్వపు రోజులు తిరిగి రావాలని, రైతులు పాడి పంటలతో చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాల డెయిరీలకు ఊతం కల్పించడంతో బాటు అమూల్‌ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని పాల సేకరణకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాలను ఆనుకుని బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పాడి సంపద బలోపేతం కోసం పాడి రైతులకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలను అందజేస్తోంది. మూగజీవాలకు మేత నుంచి వాటికి వ్యాధులు రాకుండా ఇచ్చే వ్యాక్సిన్‌లను ఉచితంగా వేసే పరిస్థితిని ప్రభుత్వం అమలు చేస్తోంది.

రాయితీపై గడ్డి విత్తనాలు

పాడి పశువులకు సమృద్ధిగా మేత అందించినప్పుడే పోషక విలువలు అధికమై పాల ఉత్పత్తి పెరుగుతుందనే ఆలోచనతో ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా గడ్డి విత్తనాలు సరఫరా చేస్తోంది. అయితే గడ్డి విత్తనాలు బయిట మార్కెట్‌లో రైతులు కొనుగోలు చేసుకోవాలంటే ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో 75 శాతం రాయితీపై ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. 5 కేజీల మినీ కిట్‌ పూర్తి ధర రూ.460 కాగా ప్రభుత్వం 75 శాతం రాయితీపై రూ.115కే అందజేస్తోంది. అందులో భాగంగానే అధికారులు జిల్లా వ్యాప్తంగా 60.02 టన్నుల గడ్డి విత్తనాలు పంపిణీకి లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు 20 టన్నుల విత్తనాలు పంపిణీ చేశారు. ఇంకా పంపిణీ చేసేందుకు 30 టన్నులు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. మరో 10 టన్నుల విత్తనాలు రావాల్సి ఉంది.

40 శాతం రాయితీపై చాప్‌ కట్టర్లు

పాడి పశువుల కోసం రైతులు గడ్డిని పెంచి దాన్ని కోసేందుకు కూలీలు ఖర్చు లేకుండా రైతులే సొంతంగా గడ్డి కోసుకునేందుకు యంత్రాలను సైతం ప్రభుత్వం 40 శాతం రాయితీపై రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తోంది. గడ్డిని కోసేందుకు 2హెచ్‌పీ సామర్థ్యం కలిగిన చాప్‌కట్టర్‌ పూర్తి ధర రూ.33,970 కాగా ప్రభుత్వం 40 శాతం రాయితీపై కేవలం రూ.13,588కే సరఫరా చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 45 చాప్‌ కట్టర్లు పంపిణీకి లక్ష్యం కాగా అందులో ఇప్పటి వరకు 36 చాప్‌ కట్టర్లు రైతులకు పంపిణీ చేసారు. ఇంకా చాప్‌ కట్టర్లు కావాల్సిన వారు రైతుభరోసా కేంద్రాల్లో వారి పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

చీపురుపల్లి మండలంలోని పేరిపి గ్రామంలో పాడి రైతులు పెంచుతున్న గడ్డి

ప్రభుత్వం ఎంతో మేలు చేసింది

నా పేరు ఇప్పిలి శివ, మాది చీపురుపల్లి మండలంలోని పేరిపి గ్రామం. నాకు 10 ఆవులు ఉన్నాయి. వాటిని పోషించుకునేందుకు గడ్డి చాలా అవసరం. ప్రభుత్వం 75 శాతం రాయితీపై గడ్డి విత్తనాలు సరఫరా చేసింది. నేను పది కేజీల విత్తనాలు రాయితీపై కొనుకున్నాను. రాయితీపై ఇచ్చే ఆ విత్తనాలు మండల కేంద్రానికి కూడా వెళ్లకుండానే ఊరిలోనే లభించాయి. ఆ గడ్డితో మా ఆవులకు చక్కగా పోషణ లభిస్తోంది.

– ఇప్పిలి శివ, పేరిపి, చీపురుపల్లి మండలం

పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి

పాడి సంపద అభివృద్ధి కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. 75 శాతం రాయితీపై గడ్డి విత్తనాలు, 40 శాతం రాయితీపై చాప్‌ కట్టర్లు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అంతేకాకుండా 4 నెలల నుంచి 8 నెలల వయస్సు ఉన్న ఆవు లేదా గేదె పెయ్యి దూడలకు బ్రూసెలోసిస్‌(ఈసుడు) రోగం రాకుండా వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా ప్రభుత్వమే వేస్తోంది.

– విశ్వేశ్వరరావు,

జాయింట్‌ డైరెక్టర్‌, పశుసంవర్థకశాఖ, విజయనగరం

మరిన్ని వార్తలు