వారి ప్రతిభ విభిన్నం

4 Dec, 2023 00:34 IST|Sakshi
ల్యాప్‌ట్యాప్‌లను అందజేస్తున్న ఎమ్మెల్యే జోగారావు

పార్వతీపురంటౌన్‌: ప్రతిభకు వైకల్యం దూరంగా ఉంటుందని ఎప్పుడూ అడ్డుకాదని, సమాజంలో సాధారణ పౌరుల కంటే దివ్యాంగులు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఐటీడీఏ గిరిమిత్ర సమావేశమందిరంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివిధాలా విభిన్న ప్రతిభావంతులను ఆదుకుంటుందని చెప్పారు. వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోందని తెలిపారు. దివ్యాంగులకు ఉన్నత విద్యాసంస్థలలో ఐదు శాతం రిజర్వేషన్‌ అమలు, ప్రతినెల పెన్షన్లు, ఉపకరణాల పంపిణీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రతినెల పెన్షన్‌

పార్వతీపురం మన్యం జిల్లాలో 15,630 మందికి ప్రతినెల పెన్షన్‌ అందిస్తున్నామని, జిల్లా ఏర్పడిన ఏడాది కాలంలో రూ.48లక్షల విలువచేసే 40 మూడు చక్రాల మోటార్‌ వాహనాలు, రూ.22 లక్షల రుణాలు, రూ.1.60 లక్షల విలువచేసే నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, రూ.15 వేల విలువచేసే స్మార్ట్‌ ఫోన్స్‌, రూ.97వేల విలువచేసే ట్రై సైకిల్స్‌ రూ.15, 16 వేలు విలువ చేసే వినికిడియంత్రాలు 4 పంపిణీ చేశామని వివరించారు. విభిన్న ప్రతిభావంతులు సమస్యలు ఉంటే ఎప్పుడైనా తనను కలిసి తెలియజేయవచ్చునని నిరంతరం అందుబాటులో ఉంటానని, వాటికి పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. బస్‌పాస్‌ల సమస్య గురించి విభిన్న ప్రతిభావంతులు తెలియజేయగా వెంటనే ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే జోగారావు మాట్లాడి సమస్యను పరిష్కరించవలసినదిగా కోరారు.

ఉపకరణాల పంపిణీ

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.లక్షా పదిహేడు వేలు విలుచేసే మూడు ల్యాప్‌ట్యాప్‌లను పార్వతీపురానికి చెందిన గట్టు సుధారాణి, గుమ్మలక్ష్మీపురం మండలం నండ్రుకోన గ్రామానికి చెందిన కొల్లిక హేమలత, తురుమామిడి గ్రామానికి చెందిన కర్రి వరలక్ష్మిలకు ఎమ్మెల్యే జోగారావు అందజేశారు. అలాగే రూ.42,750 విలువచేసే మూడు స్మార్ట్‌ ఫోన్లు, రూ.16వేలు విలువచేసే 5 వినికిడియంత్రాలు, రూ.24వేల విలువచేసే 3 వీల్‌ చైర్స్‌ పంపిణీ చేశారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముల్లు ప్రసాద్‌, పిట్టగంగులు, పెంటలక్ష్మి, ఎస్‌.భాస్కరరావు, జి.రాములమ్మ, కందిపరమేష్‌లను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు కె.కవిత, నీడ్‌ డైరెక్టర్‌లు పి.వేణు గోపాలరావు, ముల్లు ప్రసాద్‌, భాస్కరరావు, కందిశ రమేష్‌, సిబ్బంది పీవీ రమణమూర్తి తదితరులు హాజరయ్యారు.

ఎమ్మెల్యే అలజంగి జోగారావు

మరిన్ని వార్తలు