15 కోళ్లు చోరీ

4 Dec, 2023 00:34 IST|Sakshi

బలిజిపేట: బలిజిపేట–పెదపెంకి మార్గంలో ఉన్న డైరీ ఫారం వద్ద పెంచుకుంటున్న 15జాతి కోళ్లను ఎవరో దొంగిలించారని యజమాని డి.శ్రావణ్‌కుమార్‌ తెలిపాడు. చోరీకి గురైనవి సుమారు రూ.15వేల విలువైన జాతికోళ్లు అని చెప్పాడు. పెదపెంకి మార్గంలో సత్రమాను చెట్టువద్ద పాలడైరీ నిర్వహించుకుంటూ అక్కడే జాతికోళ్లను పెంచుకుంటున్నానని, రోజూ లాగానే ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి 15కోళ్లు లేవని, ఈ విషయం పోలీసులకు తెలియజేశానన్నాడు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గంట్యాడ: మండల కేంద్రానికి చెందిన బి. గణపతిరావు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు. ఆదివారం తెల్ల వారుజామున 3:30 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీసుకోవడానికి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన గణపతిరావును చికిత్స నిమిత్తం స్థానికులు విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై కె.కిరణ్‌కుమార్‌ నాయుడు తెలిపారు.

పాముకాటుతో వ్యక్తి..

జామి: మండలంలోని అలమండ గ్రామానికి చెందిన రొంగలి రమేష్‌(47) గత నెల 26వ తేదీన పొలంలో వరిచేను కోస్తున్న సమయంలో పాటు కాటుకు గురవడంతో విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సిఫారసు మేరకు విశాఖ కేజీహెచ్‌కు, అమెరికన్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై హెచ్‌సీ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు.

కొట్లాటపై కేసు నమోదు

భోగాపురం: ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన కొట్లాటపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తవుడు తెలిపారు. దీనిపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని గుడివాడ గ్రామానికి చెందిన సరగడ సన్నిబాబు, సన్నిరాజు అన్నదమ్ములు. వారి 5 సెంట్ల స్థలం కోసం వివాదం తలెత్తింది. ఈ వివాదంలో అన్న సన్నిబాబు కర్ర తీసుకుని తమ్ముడు సన్నిరాజు తలపై కొట్టడంతో ఆస్పత్రి పాలయ్యాడు. బాధితుడు సన్నిరాజు ఆదివా రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని పి.ఆమిటి గ్రామానికి చెందిన ఆరిక సంపత్‌ ఆదివారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పొలం పనులు ముగించుకుని ఇంటికొచ్చిన తల్లి అపస్మారక స్థితిలో ఇంట్లో పడి ఉన్న కుమారుడ్ని చూసి, తక్షణ సపర్యలు చేసి, కుటుంబసభ్యుల సాయంతో భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చింది. ప్రథమ చికిత్స అందించిన అనంతరం వైద్యుల సూచన మేరకు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొంతుదున్నాడు. సంపత్‌ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

ప్రత్యేక ఓటరు నమోదుకు 8,428 దరఖాస్తులు

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం, ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో ఫారం–6,7,8 కు సంబంధించి 8,428 వినతులు వచ్చాయి. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు పేర్కొన్నారు. పాలకొండ నియోజకవర్గంలోని 287 పోలింగ్‌ కేంద్రాలలో 825 ఫారం–6లు, 703 ఫారం–7లు, 854 ఫారం–8లు దరఖాస్తులు వచ్చాయి. అలాగే కురుపాం నియోజకవర్గంలో 268 పోలింగ్‌ కేంద్రాలనుంచి 516 ఫారం–6లు, 168 ఫారం–7లు, 210 ఫారం–8లు వచ్చాయి. పార్వతీపురం నియోజకవర్గంలో 233 పోలింగ్‌ కేంద్రాలనుంచి 1,794 ఫారం–6లు, 367 ఫారం–7లు, 347 ఫారం–8లు వచ్చాయి. సాలూరు నియోజకవర్గంలోని 243 పోలింగ్‌ కేంద్రాలనుంచి 1420 ఫారం–6లు,779 ఫారం–7లు,445 ఫారం–8లు వచ్చినట్లు జేసీ వివరించారు.

మరిన్ని వార్తలు