తెలుగు భాషాభ్యున్నతికి గురజాడ విశేష కృషి

4 Dec, 2023 00:34 IST|Sakshi
మహాకవి విగ్రహానికి పూలమాలలేస్తున్న చంద్రోబోస్‌
● గురజాడ విశిష్ట పురస్కార గ్రహీత చంద్రబోస్‌ ● కన్యాశుల్కం ఓ మహాకావ్యం : హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు ● ఆకట్టుకున్న మహిళల కన్యాశుల్కం నాటక ప్రదర్శన

విజయనగరం టౌన్‌: తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేసిన వారిలో గురజాడ ప్రముఖులని సినీ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత కె.ఎస్‌.చంద్రబోస్‌ పేర్కొన్నారు. స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గురజాడ విశిష్ట పురస్కారాన్ని చంద్రబోస్‌కు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు చేతుల మీదుగా అందజేశా రు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత చంద్రబోస్‌ మాట్లాడుతూ మహాకవి రాసిన పుస్తకాలు, కవిత్వం, సాహిత్యం చదివి, ఆచరించే ప్రయత్నం చేస్తున్నవాడిని కాబట్టి అద్భుతమైన అనుభూతి కలిగిందన్నారు. ఇన్నాళ్లకు ఈ మహనీయుని ఇంట అడుగు పెట్టే అదృష్టం తనకు గురజాడ సమాఖ్య ద్వారా నేటికి కలిగిందన్నారు. ఆయన పురస్కారం తనకు దక్కడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తు న్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయ మూర్తి యు.దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ సమాజంలో ఉన్న తీవ్రమైన దురాచారాన్ని చూసి మహాకవి చలించిపోయాడన్నారు. గురజాడ సంఘ సంస్కరణ, అభిలాష కలిగిన కవి అన్నారు. సాంఘిక దురాచారాలను ఎత్తిచూపడం, పరిష్కార మార్గాన్ని చూపించడం కంటే సాహిత్యానికి వేరే మార్గం లేదని లోకానికి చాటి చెప్పాడన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.కళ్యాణ చక్రవర్తి, సీనియర్‌ న్యాయవాది కెవిఎన్‌.తమ్మన్న శెట్టి, సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌, కోశాధికారి డాక్టర్‌ ఎ.గోపాలరావు, డాక్టర్‌ జక్కు రామకృష్ణ, భోగరాజు సూర్యలక్ష్మి, అనిల్‌, వెంకటేశ్వరరావు, మేకా అనంతలక్ష్మి, నవసాహితీ సంస్థ అధ్యక్షుడు సూర్యప్రకాష్‌ (చైన్నె), ఈపు విజయకుమార్‌, నాలుగెస్సుల రాజు, గురజాడ వారసులు గురజాడ వెంకటేశ్వరప్రసాద్‌, ఇందిర, లలిత తదితరులు పాల్గొన్నారు.

గురజాడ సాహిత్య పురస్కారాలు

మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన కవితా పోటీల్లో సాలూరుకి చెందిన కిలపర్తి దాలినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన కుప్పిలి వెంకటరావు, విజయనగరానికి చెందిన సాలూరు సంతోషి, విశాఖ నుంచి అల్లంశెట్టి శ్రీనివాసరావు, హైదరాబాద్‌ నుంచి దేశరాజు, విజయనగరం నుంచి రత్నాల బాలకృష్ణ, సింహాచలం నుంచి లోగిస లక్ష్మీనాయుడు, కర్నూల్‌ నుంచి సయ్యద్‌ జవహర్‌ అహ్మద్‌లు పాల్గొని గురజాడ విశిష్ట పురస్కార గ్రహీత చంద్రబోస్‌ చేతుల మీదుగా సాహితీ పురస్కారాలను అందుకున్నారు.

ఆద్యంతం ఆలోచింపజేసిన కన్యాశుల్కం

మహాకవి గురజాడ రచించిన కన్యాశుల్కం నాటక ప్రదర్శనను మహిళామణులు నిర్వహించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఈపు విజయకుమార్‌ దర్శకత్వంలో బోగరాజు సూర్యలక్ష్మి గిరీశం పాత్ర ఆద్యంతం ఆలోచింపజేసింది. వెంకటేశం పాత్రలో కుమారి వాకా దేదీప్య అద్భుతమైన ప్రతిభను చూపింది. అగ్నిహోత్రవధానులుగా కుమారి సామవేదుల గీతారాణి, కరటకశాస్త్రిగా ముళ్లపూడి సుభద్రాదేవి రక్తి కట్టించారు. బుచ్చమ్మగా సామవేదుల సత్యలత, వెంకమ్మగా ఉదయగిరి నీలిమల ప్రదర్శనకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

గురజాడ గృహాన్ని దర్శించిన చంద్రబోస్‌

మహాకవి గురజాడ స్వగృహాన్ని సినీగేయ రచయిత చంద్రబోస్‌ ఆదివారం సాయంత్రం దర్శించారు. మహాకవి చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. గురజాడ ముని మనవడు గురజాడ వెంకటేశ్వరప్రసాద్‌, ఇందిర ఆయనకు ఘన స్వాగతం పలికారు. సిరిపురపు ప్రవల్లికానారాయణ్‌ వేసిన కన్యాశుల్కంలోని పలు చిత్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం మహాకవి వాడిన బావి, తులసి కోట, మేడపైన గదిలో ఉన్న గురజాడ వాడిన కళ్లద్దాలు, పుస్తకం, పరిశీలించారు. విజిటర్స్‌ డైరీలో సంతకం పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహాకవి స్వదస్తూరిని చూసి ఆనందించారు.

మరిన్ని వార్తలు