కాంగ్రెస్‌ను కోరుతున్న ప్రజానీకం

29 Nov, 2023 01:22 IST|Sakshi
మాట్లాడుతున్న జైరాం రమేశ్‌

వైఎస్సార్‌ హయాంలో

హైదరాబాద్‌ అభివృద్ధి

కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌

నయీంనగర్‌: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారని, తెలంగాణలో తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ అన్నారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జైరాం రమేశ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారన్నారు. తెలంగాణలో నియంతపాలన పోయి కాంగ్రెస్‌ ప్రజాపాలన రాబోతోందని కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే పరిమితం చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందన్నారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడో నిర్ణయించిందని, కానీ.. స్థల సేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. వరంగల్‌ నగరాన్ని కుట్రపూరితంగా అభివృద్ధి చేయకుండా నిధులు దారి మళ్లించారన్నారు. రాబోయే కాంగ్రెస్‌ పాలనలో వరంగల్‌ను ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ నాటకాల దుకాణం బంద్‌ అవుతుందని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలీ శర్మ, వరంగల్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ రవీంద్ర ఉత్తమ్‌రావు దళ్వీ, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శోభారాణి, వరంగల్‌ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు రాఘవరెడ్డి, రియాజ్‌ పాల్గొన్నారు.

సిటిజన్‌ యాప్‌లో

పోలింగ్‌ శాతం

కాజీపేట: పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ మొదలైనప్పటి నుంచి ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల అధికారులు వెల్లడిస్తారు. 17–ఏ రిజిస్టర్‌లో నమోదు చేసిన ఓట్లు, ఓటరు స్లిప్పులు, కంట్రోల్‌ యూనిట్‌లో మొత్తం ఓట్లు ఏకీభవించాలి. అప్పుడు పోలింగ్‌ శాతాన్ని ప్రకటిస్తారు. పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన శాతాన్ని ప్రిసైడింగ్‌ అధికారులు సంబంధిత సెక్టార్‌ అధికారులకు పంపిస్తారు. సెక్టార్‌ అధికారులు జిల్లా ఎన్నికల అధికారులకు సమాచారమందిస్తారు. జిల్లా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ పోలింగ్‌ శాతం తెలుసుకోవాలంటే సిటిజన్‌ యాప్‌లో చూడవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు