కారులో నగదు.. కాంగ్రెస్‌ నేతపై దాడి?

29 Nov, 2023 01:22 IST|Sakshi

దేశాయిపేట: దేశాయిపేటలో నగదు తరలిస్తున్నారనే సమాచారంతో సోమవారం రాత్రి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆకస్మికంగా కార్లను తనిఖీ చేసినట్లు తెలిసింది. రాత్రి పూట ఎనిమిది కార్లల్లో తిరుగుతూ.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నానా హంగామా చేసినట్లు సమాచారం. రోడ్డుపై వెళ్తున్న ఓ కారుకు.. అధికార పార్టీ నేత తన కారును అడ్డుపెట్టి ఆపినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనుచరులు కార్లు దిగి కాంగ్రెస్‌ నాయకుడు సదానందం కారు డోర్లను కొడుతూ.. కారులో డబ్బులున్నాయంటూ చెక్‌ చేసి, చివరికి ఏమీ లేవని వెళ్లగొట్టినట్లు తెలిసింది. ఇదే విషయమై అధికార పార్టీ నేత ఇంతేజార్‌ గంజ్‌ సీఐకి ఫోన్‌లో సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. నిమిషాల్లో సీఐ ఘటనా స్థలికి చేరుకున్నారు. కాగా.. సీఐ వాహనంలో నుంచి ఒక రౌడీ షీటర్‌ దిగి పోలీసుల సమక్షంలోనే సదానందంపై దాడికి పాల్పడ్డాడని, సదరు రౌడీషీటర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేతలపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎన్నికల అధికారులను డిమాండ్‌ చేశారు. ఈవిషయం వాట్సాప్‌లో వైరల్‌ అవడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు