మైనర్‌ బాలికపై రెచ్చిపోయిన కామాంధులు

29 May, 2021 17:53 IST|Sakshi

గిరిజన అమ్మాయిపై అఘాయిత్యం, హత్య

పట్టపగలే చోటు చేసుకున్న ఘాతుకం

ఉపాధి హామీ పనులకు వెళ్లి వస్తుండగా ఘటన

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో దారుణం

నేరస్తులని కఠినంగా శిక్షిస్తాం - మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్: ఉపాధి హామీ పనులకు వెళ్లిన బాలికపై దారుణానికి ఒడిగట్టారు మృగాళ్లు. దారికాచి మరీ దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ బాలిక ప్రాణాలు బలి తీసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలో జరిగిన ఈ ఘటన కామాంధుల కౄరత్వానికి పరాకాష్టగా నిలిచింది.


చేదోడువాదోడు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామ శివారు సీతారాం తండాకు చెందిన ఓ మైనర్‌ బాలిక ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటోంది. తల్లిదండ్రులకు చేదోడు వాడోడుగా ఉండేందుకు ఉపాధి హామీ పనులకు వెళ్తోంది. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కిరాణా దుకాణం వరకు వెళ్లి వస్తానంటూ చెప్పి బయటకు వెళ్లింది.

గుట్టల్లో శవమై
ఆ తర్వాత గంట సేపటికి గ్రామానికి సమీపంలో ఉన్న గుట్టల్లో తీవ్ర రక్తస్రావంతో అచేతంగా ఆ బాలిక పడిపోయి ఉందంటూ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామస్తులు ఆమె తండ్రికి సమాచారం అందించారు. అంతా గుట్టపైకి వెళ్లి చూడగా అప్పటికే ఆ మైనర్‌ బాలిక చనిపోయి ఉండడం చూసి బోరున విలపించారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. 


లైంగికదాడి
తనకు నలుగురు ఆడపిల్లలని, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భార్య చనిపోయిందని ఆ మైనర్‌ బాలిక తండ్రి తెలిపాడు. అప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కూతురిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగిక దాడి చేసి, దారుణంగా చంపేశాడని ఆయన ఆరోపించాడు.


కఠినంగా శిక్షించాలి- మంత్రి సత్యవతి రాథోడ్‌
మైనర్‌ బాలిక హత్య ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన నేరస్తున్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. పేదరికం నుంచి వచ్చి ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయి పట్ల ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం దారుణమన్నారు. ఇది క్షమించరాని నేరమన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. 

దారుణం- మాలోతు కవిత ఎంపీ
గిరిజన బాలికపై అత్యాచారం.. హత్య సంఘటనను  మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్ కవిత ఖండిచారు. మహిళలపై ఇలాంటి దాడి జరగడం దారుణమన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు