అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

11 Mar, 2023 09:40 IST|Sakshi

టి.నరసాపురం: అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఎస్‌వీకే కుమార్‌ హెచ్చరించారు. టి.నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామ వీధుల్లో అటవీ సిబ్బంది పోలీసు సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించారు. అటవీ భూముల్లోకి ప్రవేశించినా, అటవీ సంపదకు నష్టం కలిగించినా, అడవిని తగులబెట్టినా తీవ్రమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా మైక్‌ ప్రచారం నిర్వహించారు.

ఆక్రమణకు యత్నించిన నలుగురిపై కేసు నమోదు

ఇటీవల కొందరు గ్రామస్తులు అటవీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించి అడవుల్లోని చెట్లు, తుప్పలు తొలగించి తగులబెట్టారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది వారిని అడ్డుకుని, టి.నరసాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కె.సతీష్‌కుమార్‌ నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. గత రెండు సంవత్సరాలుగా స్థానికులు పలుమార్లు అటవీ భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తుండటం, అటవీ అధికారులు వారిని అడ్డుకుని కేసులు పెట్టడం జరుగుతోంది. తాజాగా ఆక్రమణకు పాల్పడేందుకు యత్నించిన వారిపై మరోసారి కేసు నమోదైంది. ఆ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు టి.నరసాపురం ఎస్సై సిబ్బందితో శుక్రవారం కొత్తగూడెం గ్రామానికి వెళ్లారు. అదే తరుణంలో ఫారెస్ట్‌ రేంజర్‌, వారి సిబ్బంది సుమారు 150 మందితో అటవీ ప్రాంతాన్ని సంరక్షించుకునేందుకు గ్రామానికి వచ్చారు. ఈ తరుణంలో ఇరు శాఖల అధికారులూ సిబ్బందితో కలిసి గ్రామంలో కవాతు నిర్వహించారు. అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

చింతలపూడి : మండలంలోని గణిజర్ల గ్రామంలో నాటుసారా తయారీ స్థావరాలపై స్థానిక పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని 50 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి వినియోగిస్తున్న రెండు అల్యూమియం పాత్రలు, ఒక డ్రమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు మొగిలి చిలకయ్య, కందుల శివకుమార్‌లను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు