టీడీపీకి ఘోర పరాభవం

18 Mar, 2023 00:24 IST|Sakshi
శనివారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2023

సాక్షి ప్రతినిధి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస సంఖ్యాబలం లేనప్పటికీ పోటీ చేసి ఉన్న పరువు పొగొట్టుకుంది. ఏకగ్రీవమైతే చంద్రబాబు కోప్పడతారని, చివరి నిమిషంలో నలుగురితో నామినేషన్లు వేయించి వారిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించి జనసేన అంతర్గత మద్దతుతో ఎమ్మెల్సీ పోరులో హడావుడి చేశారు. తీరా పోలింగ్‌ జరిగి కౌంటింగ్‌ పూర్తయ్యాక చూస్తే టీడీపీకి సొంత ఓట్లు కూడా పడలేదు. ముందు వరకు హడావుడి చేసిన నేతలు కౌంటింగ్‌ ముగిశాక ముఖం చాటేశారు. దీంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ వాస్తవ బలం మరోసారి బహిర్గతమైంది.

సంఖ్యాబలం లేకున్నా బరిలోకి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది. పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లు కూడా పార్టీ అభ్యర్థికి వేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీలో బీసీలను నిర్లక్ష్యం చేస్తుండటంతో వారు ఆ పార్టీని వీడుతుండటం, ఇలా వరుస పరిణామాలతో టీడీపీ గందరగోళంలో పడింది. స్థానిక సంస్థల కోటాలో జిల్లాలో ఖాళీకానున్న రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గతంలో పూర్తి సంఖ్యా బలం టీడీపీకి ఉండటంతో రెండు స్థానాలు టీడీపీ గెలిచింది. ఈ సారి 85 శాతంపైనే స్థానిక సంస్థలు వైఎస్సార్‌సీపీకి దక్కడంతో ఆ పార్టీ సునాయాసంగా ఆ రెండింటిని గెలవగలదు. తెలుగుదేశం పార్టీకి 125 స్థానాలు, మిత్రపక్షమైన జనసేనకు 70 ఓట్లు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యతలో గెలవాలంటే సగటున 340 పైచిలుకు ఓట్లు అవసరం. సామాజిక సమీకరణాలు లెక్క వేసుకుని ఉన్న 195 ఓట్లకు అదనంగా మరికొన్ని ఓట్లు పడతాయనే ఆలోచనతో టీడీపీ అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌ను బరిలో నిలిపారు. అంతటితో ఆగకుండా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జులే ప్రచారం నిర్వహించి మరోవైపు సామాజిక కోణంలోనూ ప్రచారం చేశారు. తీరా పోలింగ్‌ రోజున ఆ పార్టీ క్యాడర్‌ షాకిచ్చింది.

టీడీపీ ఓట్లు గోవిందా

టీడీపీ, జనసేన కలిపి ఉన్న 195 ఓట్లల్లో 122 ఓట్లే అభ్యర్థికి దక్కాయి. టీడీపీ ఓట్లు నూరు శాతం పోలైనట్లు పార్టీ శ్రేణులే పోలింగ్‌ రోజున ధ్రువీకరించాయి. కౌంటింగ్‌ ముగిసిన తరువాత చెల్లుబాటు కాని 25 ఓట్లు టీడీపీవి అని తేలింది. 195 ఓట్లగాను 122 ఓట్లతో టీడీపీ సరిపెట్టుకుంది. సామాజిక కోణంలో కనీసం రెండో ప్రాధాన్యత ఓటుగానైనా దక్కించుకోవాలని తెరచాటు యత్నాలు చేసినా టీడీపీ ఓటర్లే తిప్పికొట్టడం విశేషం.

జయమంగళ చేరికతో మరింత బలం

తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా క్రియాశీలకంగా ఉన్న కై కలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎన్నికల సమయంలో వెన్నుపోట్లతో ఓటమి పాలయ్యేలా చేసి జయమంగళకు రాజకీయంగా ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి అనేక కుయుక్తులు పన్నారు. కట్‌ చేస్తే వైఎస్సార్‌సీపీ జయమంగళాన్ని పార్టీలో చేర్చుకుని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో పార్టీ శ్రేణులు షాక్‌ తిన్నారు. కొల్లేరులో బలమైన నేత కావడం, కొల్లేరు ప్రజల సమస్యలపై పోరాటం చేసే నేతగా గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఆయనను ఈ నెల 23న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇటీవల ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఆళ్ళ నాని, కై కలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావులతో కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎమ్మెల్సీ బీఫాం అందుకున్నారు.

న్యూస్‌రీల్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓట్లు కూడా పడని వైనం

ముఖ్యనేతలతో పాటు జనసేన ఝలక్‌

రెండు పార్టీలకు కలిపి 192కు గాను దక్కినవి 122 ఓట్లే..

జయమంగళ చేరికతో వైఎస్సార్‌సీపీకి కొల్లేరులో అదనపు బలం

మరిన్ని వార్తలు