'మౌనంగా ఉండకండి.. ముక్కలైపోయిన హృదయంతో రాస్తున్నా'

16 Aug, 2021 19:36 IST|Sakshi

అఫ్గన్‌ సంక్షభంపై డైరెక్టర్‌ సహ్ర కరిమి బహిరంగ లేఖ

అఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. తాలిబన్లు మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ అఫ్గనిస్తాన్‌ వదిలి పారిపోయారు. ఇక ప్రజలు కూడా దేశం వదిలి పారిపోయేందుకు అష్టకష్టలు పడుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ దర్శకురాలు సహ్ర కరిమి తమ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై బహిరంగ లేఖను రాసింది.

'గత కొన్నివారాలుగా తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌లోని పలు బలగాలను తమ వశం చేసుకున్నారు. చాలామంది ప్రజలను ముఖ్యంగా చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేసి పెద్ద వయసున్న వారికిచ్చి పెళ్లి చేశారు. ఓ కమెడియన్‌ను విపరీతంగా హింసించి చంపేశారు. మరో మహిళ కళ్లు పీకేశారు. ఇవే కాకుండా కొంతమంది రచయిలు, మీడియా, ప్రభుత్వ పెద్దలను చంపేశారు.

తమ దేశం తాలిబన్ల వశమవడంతో అఫ్గనిస్తాన్‌ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దేశ అభ్యుదయం కోసం ఎంతో కష్టపడి సాధించుకున్నవన్నీ ప్రమాదంలో ఉన్నాయి. తాలిబన్లు పాలిస్తే అన్ని కళలను నిషేధిస్తారు. మహిళల హక్కులను కాలరాస్తారు. భావ వ్యక్తీకరణను అడ్డుకుంటారు. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు పాఠశాలలో బాలికల సంఖ్య సున్నా. కానీ ఇప్పుడు 9 మిలియన్లకు పైగా అఫ్గన్‌ బాలికలు స్కూల్‌కు వెళ్తున్నారు.

తాలిబన్ల నుంచి మా ప్రజలను కాపాడటంతో మీరు నాతోచేతులు కలపండి. ముక్కలైపోయిన హృదయంతో, ఎంతో ఆశతో ఈ లేఖ రాస్తున్నాను. దయచేసి దీన్ని అందరూ షేర్‌ చేయండి. మౌనంగా ఉండకండి' అంటూ ఆమె ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను బాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌, మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సహా పలువురు రీట్వీట్లు చేశారు. 

A post shared by Anurag Kashyap (@anuragkashyap10)

మరిన్ని వార్తలు