భారత్‌కు త్వరలో ఇజ్రాయెల్ డ్రోన్లు

26 Nov, 2020 18:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం చైనాకి భారత్‌కి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉద్రక్తిత వాతావరణం నెలకొంది. అందుకే భారత్‌ భారీగా సరిహద్దులో బలగాలను మొహరిస్తోంది. ఇప్పుడు భారత్‌ తన శక్తి సామర్ధ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. పనిలో పనిగా ఆధునిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలను భారత అమ్ములపొదిలో చేరుస్తోంది. ముఖ్యంగా డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించింది. ఈ మధ్యకాలంలో అధిక సంఖ్యలో డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. ఇజ్రాయెల్​కు చెందిన హెరాన్​, అమెరికాకు చెందిన మినీ డ్రోన్లు త్వరలోనే భారత్​ చేతికి అందనున్నాయి. ఈ డ్రోన్లు భారత్‌ కు తీసుకొని వచ్చే ఒప్పందం తుది దశలో ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌ నెలలో ఈ కీలక ఒప్పందం కుదిరే అవకాశముంది. ఈ డ్రోన్లను భారత్‌ తూర్పు లద్దాఖ్​తో పాటు చైనా సరిహద్దుల్లో వీటిని మొహరించనుంది.

ఈ డ్రోన్లను ముఖ్యంగా ఓ ప్రాంతంలోని నిర్దిష్ట సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించనున్నారు. ఈ మధ్యకాలంలో సరిహద్దులో చైనా బరితెగింపు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు రక్షణ శాఖ అత్యవసర కొనుగోళ్లకు అనుమతులివ్వడంతో అనేక రకాల ఆయుధాలను అత్యవసరంగా భారత సైన్యంలోకి తీసుకొని వస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలు తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటున్నాయని  విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు