సామాజిక విప్లవానికి నాంది కులగణన

25 Nov, 2023 00:21 IST|Sakshi

అభిప్రాయం

గెలిచే అవకాశాలున్న పార్టీలో ఎన్నికల ముందు ఎక్కువ సీట్లు అడగడానికీ, గెలిచిన పార్టీలో ఎన్నికల తరువాత ఎక్కువ పదవులు కోరడానికీ రాజకీయ నాయకులు కులం కార్డును వాడడం సహజం. ఇలాంటి సందర్భాల్లో ప్రతీ కులం తన జనాభా సంఖ్యనూ,  శాతాన్ని పెంచి చెపుతుంటుంది. ఈ శాతాల న్నింటినీ కూడితే సులువుగా 300 దాటు
తుంది! ఎన్నికల సంవత్సరంలో కులగణన చర్చ మరింత వేడెక్కుతోంది.

సమాజంలో విభిన్న సమూహాల మధ్య సంబంధాలను నిర్ణయించడంలో వేల సంవత్సరాలుగా  కులం ప్రధాన పాత్ర పోషిస్తున్న దేశం మనది. ప్రతి కులానికి ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. మన దేశంలో 5 వేలకు మించి కులాలున్నాయని అంచనా. కులాలతోనే మన దేశంలో సామాజిక అంతస్తుల దొంతర ఏర్పడుతోంది. వీటిని అర్థం చేసుకోవడానికి కులగణన ఒక చారిత్రక అవసరంగా మారింది. సామా జిక విప్లవానికి కులగణన నాంది పలుకుతుంది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలోనే విద్యా, ఉపాధి రిజర్వేషన్లు కల్పించారు. సామాజిక వివక్షకు గురవుతూ, విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్న సమూహాల కోసం ఉద్దీపన చర్యలు చేపట్టడంలో చాలా తాత్సారం జరిగింది.

1979 జనవరి 1న ప్రధాని మొరార్జీ దేశాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ‘సోషల్లీ అండ్‌ ఎడ్యుకేషనల్లీ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ కమిషన్‌’ను నియమించారు. స్వల్ప కాలం బిహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన బిందేశ్వరీ ప్రసాద్‌ మండల్‌ను చైర్మన్‌గా నియమించడంతో దానికి ‘మండల్‌ కమిషన్‌’ అనే పేరు వచ్చింది. రెండేళ్ళ పరిశీలన తరువాత 1980 డిసెంబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి బీపీ మండల్‌ తన నివేదికను సమ ర్పిస్తూ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేశారు. ఇక్కడ ఒక విచిత్రం వుంది. మండల్‌ కమిషన్‌ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ ఇమ్మందిగానీ, కులగణన నిర్వహించమనలేదు. బ్రిటిష్‌ కాలపు రికార్డుల ప్రకారం దేశంలో బీసీల జనాభా 54 శాతం ఉంటుందని అంచనా వేసి అందులో 50 శాతం అనగా 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. 

ఓబీసీ రిజర్వేషన్ల కేసు మీద అంతిమ తీర్పు రాకముందే 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ మండల్‌ కమిషన్‌ సిఫార్సుల్లో కొన్నింటిని అమలుపరచ బోతున్నట్టు ప్రకటించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. జనతాదళ్‌ నాయ కుడైన వీపీ సింగ్‌కు లోక్‌ సభలో మెజారిటీ లేదు. ఎన్‌టీ రామారావు నాయకత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా రంగంలో దిగి, బయటి నుండి బీజేపీ ఇచ్చిన మద్దతుతో ఆయన  ‘మైనారిటీ ప్రభుత్వానికి’ ప్రధాని అయ్యారు. 

అప్పట్లో బీజేపీకి లోక్‌ సభలో 85 సీట్లున్నాయి. ఓబీసీలకు రిజర్వే షన్లు కల్పిస్తే తన ఓటు బ్యాంకు అయిన ఓసీలు పార్టీకి దూరం అయి పోతారని ఆ పార్టీ భయపడింది. అప్పటి బీజేపీ అధ్యక్షులు ఎల్‌కే అడ్వాణి 1990 సెప్టెంబరు 25న సోమనాథ్‌ నుండి అయోధ్య వరకు 35 రోజుల ‘రామ్‌ రథయాత్ర’ మొదలెట్టారు. దీనికి  రెండు లక్ష్యాలు న్నాయి. మొదటిది; మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలును అడ్డుకోవ డానికి ఏకంగా వీపీ సింగ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం. రెండోది, ముస్లింల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకును సమీకరించడం. ఈ రెండు లక్ష్యాల రథయాత్రను రాజకీయ విశ్లేషకులు ‘మండల్‌–కమండల్‌’ అని పిలిచేవారు. బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో 1990 నవంబరు 7న  వీపీ సింగ్‌ ప్రభుత్వం పడిపోయింది.

రెండేళ్ల తరువాత 1992 నవంబరు 16న ‘ఇంద్ర సహానీ కేసు’లో సుప్రీం కోర్టు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను ఆమోదిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించ రాదనీ, క్రీమీలేయర్‌ కుటుంబాలను రిజర్వేషన్‌ పరిధి నుండి తప్పించా లనీ కొత్తగా రెండు నిబంధనలు పెట్టింది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన పక్షం రోజుల్లోనే కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేశారు.

 బ్రిటిష్‌ పాలకులు భారత దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సమాజ స్వభావాన్ని, ముఖ్యంగా కుల, మత స్వభావాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరముందని గుర్తించారు. 1881లో తొలి సారిగా జనగణన నిర్వహించారు. ఆ మరు సంవత్సరం అంటే 1882లో విలియం విల్సన్‌ హంటర్‌ నాయకత్వాన ఏర్పడిన కమిషన్‌ దేశంలో కులగణన నిర్వహించింది. అప్పటి నుండి ప్రతి పదేళ్ళకు ఒకసారి జనగణన కార్యక్రమం క్రమం తప్పకుండ సాగుతోంది. కానీ, కులగణన జరగలేదు.

 స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టిన ఘనత బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు దక్కుతుంది. దేశంలో అంతటి చొరవను చూపిన మరో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే. బిహార్‌లో 214 కులాలున్నట్టు తేలింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 7 వందలకు పైగా  కులాలున్నట్టు అంచనా. ఆ లెక్కన ఏపీ కులగణన ప్రాజెక్టు బిహార్‌ కన్నా మూడు నాలుగు రెట్లు పెద్దది. రెండేళ్ళ క్రితం బిహార్‌ రాష్ట్ర అఖిలపక్షం ఢిల్లీ వెళ్ళి కులగణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కోరింది. దానికి వాళ్ళు అంగీకరించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఎస్సీ, ఎస్టీ మినహా మరెవ్వరికీ కులగణన నిర్వహించడం తమ విధానం కాదని 2021 జులై 20న పార్లమెంటులో ఒక విస్పష్ట ప్రకటన చేశారు.

బీజేపీది ఒక విచిత్రమైన వ్యవహారం. ఒకవైపు, ఉచితాలు దేశఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అంటుంది; ఎన్నికల ప్రచారంలో తామర తంపరగా ఉచితాలను ప్రకటిస్తుంది. ఒకవైపు, కులం వంటి సంకుచిత భావాలకు తాము దూరం అంటుంది. ఎన్నికలకు ముందు కుల సమ్మేళ నాలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది మొదట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నిర్వహించిన కుల సమ్మేళనాలను చూశాం. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్ళీ అలాంటివే చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ లో ‘బీసీ సమ్మేళనం’లో పాల్గొన్నారు; నాలుగు రోజుల్లో మళ్ళీ వచ్చి ‘మాదిగ సమ్మేళనం’లో పాల్గొన్నారు. కానీ, విధాన పరంగా వారు కులగణనకు వ్యతిరేకం. 

నిజానికి సామాజిక న్యాయానికి కులగణన ఒక ప్రాతిపదిక అవుతుంది. సంక్షేమ పథకాలను అడగడానికి ప్రజలకూ, వాటిని రూపొందించడానికి ప్రభుత్వాలకూ అది ఆధారంగా మారుతుంది. ఇప్పుడు కుల గణన ‘ఇండియా కూటమి’కి  కొత్త అస్త్రంగా మారింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధి ప్రతి సభలోనూ ‘జిత్నీ ఆబాదీ; ఉత్నా హక్‌’, ‘జిస్కి జిత్ని భాగేదారీ; ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ’ (ఎంత జనాభో అంత హక్కు) అంటున్నారు. ఏపీలో తలపెట్టనున్న కులగణన విజయవంతం కావడం రాజకీయంగా వైసీపీ కన్నా సమాజానికి మరింత మేలు చేస్తుంది.

- డానీ

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు

మరిన్ని వార్తలు