విమాన సౌకర్యం.. పర్యాటకల సాకారం

22 Mar, 2023 10:01 IST|Sakshi

కడప కల్చరల్‌ : వైఎస్సార్‌ జిల్లా పలు రకాల పర్యాటక ప్రాంతాల ఖిల్లాగా కేంద్ర ప్రభుత్వం దృష్టిని కూడా ఆకర్శించింది. గండికోటలో అంతర్జాతీయ ఒబెరాయ్‌ లాంటి ఆతిథ్య సంస్థలు సెవెన్‌స్టార్‌ హోటళ్లు, విల్లాల నిర్మాణానికి సిద్ధం కావడంతో అది అంతర్జాతీయంగా క్రమంగా పేరు గడిస్తోంది. దీంతోపాటు జిల్లాలోని ఒంటిమిట్ట, వేంపల్లె గండి, అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రాలయం, హార్సీలీహిల్స్‌తోపాటు జిల్లాలో అటు ఆధ్యాత్మిక, ఇటు చారిత్రక ఎకో టూరిజం ప్రాంతాలు ఉన్నాయి. ఇంతవరకు సమస్యగా ఉన్న విమానయానం ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చే అవకాశం పెరిగింది. దీంతో జిల్లాలోని పర్యాటకప్రాంతాలు మరింతగా పర్యాటకులతో కళకళలాడడంతోపాటు జిల్లాకు ఆర్థికంగా కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

అంతర్జాతీయ స్థాయిలో
శని, ఆదివారాలు వస్తే చాలు...అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా పేరున్న గండికోట ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. దాదాపు రెండు మాసాల ముందు బుక్‌ చేసుకుంటే కానీ అక్కడి హరిత హోటల్‌లో గదులు దొరికే అవకాశం లేదు. వీకెండ్స్‌తోపాటు ఇతర సెలవు దినాల్లో గండికోటకు మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. వీరిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఎక్కువశాతం కనిపిస్తారు. మొన్నటివరకు డబ్బుకు వెనుకాడని ఆ ప్రాంత పర్యాటకులు నేరుగా విమాన సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, మోటారు బైకుల్లో వస్తున్నారు.

వైఎస్సార్‌ జిల్లా ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు సిద్ధమైంది. జిల్లా కేంద్రమైన కడప నగరంలోని విమానాశ్రయాన్ని ఇటీవల పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచడంతో ఈ అవకాశం ఏర్పడింది. దీంతోపాటు వైఎస్సార్‌ జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం, బహ్మంగారిమఠం, వేంపల్లె గండి, ఇడుపులపాయ తదితర ప్రాంతాలకు రానున్న పర్యాటకులకు విమాన సౌకర్య అందుబాటులోకి రానుంది. అటు అన్నమయ్య జిల్లాలోని వీరభద్రస్వామి ఆలయం, హార్సీలీహిల్స్‌తోపాటు పలు ప్రాంతాలకు కూడా కడప విమానాశ్రయం ద్వారా వచ్చే అవకాశం ఉంది.

సమ్మిట్‌తో పెరిగిన అవకాశం
ఈనెల 3, 4 తేదీలలో విశాఖపట్టణంలో జరిగిన జీఐఎస్‌ ఒప్పందాల కారణంగా మన జిల్లాలో కూడా పలు పరిశ్రమలు రానున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఒబెరాయ్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థలు ఆ సమ్మిట్‌లో పలు ఒప్పందాలు చేసుకున్నాయి.

విమానాశ్రయం విస్తరణ
ఇటీవల కడప ఎయిర్‌పోర్టును విస్తరించారు. రెండు నుంచి పార్కింగ్‌ స్టాండ్లను ఏడు విమానాల స్థాయికి తెచ్చారు. విమానయాన సంబంధిత అవసరాలను గుర్తించి ఎయిర్‌పోర్టును రూపుదిద్దుతున్నారు. దీంతోపాటు రాత్రి పూట కూడా విమానాలు దిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన లైటింగ్‌, ఇతర సాంకేతిక పనులను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లు తుది దశలో ఉండడం, నూతన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేందుకు కేవలం అనుమతులు రావాల్సి ఉండడంతో జిల్లా పర్యాటకంగా కూడా అభివృద్ధి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలతోపాటు మన జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ఎక్కువగా విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు విశేష సంఖ్యలో వస్తున్నారు. ఆధునిక విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో పెద్ద నగరాలకు చెందిన పర్యాటకులు ఈ ప్రాంతానికి ఎక్కువ సంఖ్యలో వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కడప నగరంలోని ప్రైవేటు ట్రావెలింగ్‌ ఏజెన్సీలు ఇప్పటికే ఆ నగరాల్లోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలతోపాటు ఇతర కార్పొరేట్‌ సంస్థలకు వెళ్లి విమానాల ద్వారా జిల్లా పర్యాటక ప్రాంతాల సందర్శనకు వీకెండ్‌ ట్రిప్పులు బుక్‌ చేస్తున్నారు. ఆయా నగరాల నుంచి నేరుగా విమానం ద్వారా కడపకు ఇక్కడి నుంచి ప్రైవేటు ట్రావెలింగ్‌ సంస్థలు ఏర్పాటు చేసే కార్లు, ఇతర వాహనాల ద్వారా నేరుగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సౌకర్యం లభిస్తోంది. దీంతో ఇటీవల కడప నగరంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రైవేటు బుకింగ్‌ ఏజెన్సీలు వెలిశాయి.

మరిన్ని వార్తలు