పరిమళించిన మానవత్వం: అప్పుడు తమిళ తంబి, ఇప్పుడు రామకృష్ణారెడ్డి

3 May, 2023 01:46 IST|Sakshi

వైఎస్సార్​​​​​: మండల కేంద్రమైన కలసపాడులోని ఆర్టీసీ బస్టాండులో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అనాథ వృద్ధుడిని వివేకానంద ఆశ్రమం చేరదీసింది. వివరాలు.. అనాథ అయిన ఇతను గాలికి తిరుగుతూ.. దొరికింది తింటూ నెల్లూరు నగరం చేరాడు అరవై ఏళ్ల క్రితం. అప్పటికి తనకు పదహారేళ్లు. అక్కడ హోటల్‌ నడుపుతున్న తమిళ తంబి రమ్మని పిలిచాడు. అన్నం పెట్టాడు. ఆశ్రయం ఇచ్చాడు. అమ్మానాన్న, గురువు అన్నీ తానే అయ్యాడు. హోటల్‌ యజమాని తొలిసారి తనను కుమార్‌ అని పిలిచాడు. అదే పేరుగా మారిపోయింది.

​కుమార్‌కు హోటల్‌ యజమానే వివాహం చేశాడు. కాలక్రమంలో హోటల్‌ యజమాని చైన్నెకి వెళ్లడంతో హోటల్‌ మూతపడింది. కుమార్‌ భార్య కూడా కాన్యర్‌తో మృతిచెందింది. దీంతో అనాథ అయిన కుమార్‌ నెల్లూరు నగరాన్ని వదిలి పాదచారిగా ప్రయాణం ప్రారంభించాడు. ఓపిక ఉన్నంత కాలం తిరిగాడు. అలసిపోయి మూడు రోజుల కిందట కలసపాడుకు చేరుకున్నాడు.

ఆర్టీసీ బస్టాండులో ఉన్న అనాథ పరిస్థితిని గమనించిన స్థానిక వలంటీర్‌ శ్రావణ్‌కుమార్‌ వివేకానంద సేవాశ్రమం వ్యవస్థాపకులు పాపిజెన్నిరామకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చారు. బుధవారం ఆయన, ఆయన సతీమణి రామతులసితో వచ్చి అనాథకు స్నానం చేయించారు. ఫలహారం అందించారు. అనంతరం వివేకానంద సేవాశ్రమానికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించారు. మానవత్వంతో కూడిన వీరి సేవలను స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు