శభాష్‌ సిస్టర్స్‌

6 May, 2023 12:20 IST|Sakshi

రాజుపాళెం : ఆడపిల్లలు తమ జడలను అపురూపంగా చూసుకుంటారు. ఒక్క వెంట్రుక రాలిపోతున్నా ఎంతో మనోవేదనకు గురవుతారు. క్యాన్సర్‌ బారిన పడిన వారికి కీమోథెరపీ ఇవ్వడం కారణంగా తల వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి గుండు ఏర్పడుతుంది. ఇలాంటి వారికి తల వెంట్రుకలు దాదాపుగా తిరిగి రావు. ఒక వైపు క్యాన్సర్‌ మహమ్మారి సోకిందనే వేదన.. మరోవైపు ఎంతో అపురూపంగా చూసుకున్న తలవెంట్రుకలు పోయి అందవిహీనంగా మారామనే బాధ వారిని తీవ్రంగా కలచి వేస్తుంది. ఇలాంటి వారికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు విగ్గులు తయారు చేసి ఉచితంగా అందిస్తున్నాయి. క్యాన్సర్‌ పేషెంట్ల కోసం మేము సైతం అంటూ అక్కా చెల్లెళ్లు తమ పొడవాటి జుట్టును దానం చేశారు.

పుట్టిన రోజు సందర్భంగా..
రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన అప్సానా, సుహానా అక్కాచెల్లెళ్లు. క్యాన్సర్‌ పేషెంట్ల కోసం పలువురు యువతులు, బాలికలు జుట్టు దానం చేసిన వీడియోలను వారు ఇటీవల సోషల్‌ మీడియాలో చూశారు. చూసిందే తడవుగా తాము కూడా తమ వంతుగా క్యాన్సర్‌ బాధితులకు జుట్టు ఇచ్చి సాయపడేందుకు నిర్ణయించుకున్నారు. సుహానా జన్మదినం సందర్భంగా శుక్రవారం చెల్లెలుతోపాటు అక్క అప్సానా కూడా జుట్టును దానం చేయడం విశేషం. కత్తిరించిన ఇరువురి జడలను ప్రొద్దుటూరులోని స్టార్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు సిరాజ్‌కు అందజేశారు. చిన్నారుల్లో కలిగిన మంచి ఆలోచనను ఆయన అభినందించారు. కురులను క్యాన్సర్‌ పేషెంట్ల కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థకు పంపనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వీరి మాదిరే జుట్టును దానం చేసి క్యాన్సర్‌ పేషెంట్లకు సాయపడాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు